వారివ్వ‌క‌పోతే.. మ‌న‌మే ఇద్దాం: రేవంత్ రెడ్డి

తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి పెద్ద ఇబ్బందే వ‌చ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లు వ్య‌వ‌హారం.. ఎటూ తేల‌క‌పోవ‌డం, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దీనిపై ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకోవ‌డంతో దీనిపై ఏం చేయాల‌న్న విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించుకోలేక పోతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేయించిన కుల గ‌ణ‌న‌లో రాష్ట్రంలో బీసీలు ఎక్కువ మంది ఉన్నార‌ని తేలింది. దీంతో వారికి ప్రాధాన్యం పెంచుతూ.. బీసీల‌కు 42 శాతం మేర‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని భావిస్తున్నారు.

ఈ ప్ర‌కార‌మే.. కొన్నాళ్ల కింద‌ట అసెంబ్లీలో రిజ‌ర్వేష‌న్‌కు సంబంధించి ఓ బిల్లు సిద్ధం చేశారు. దీనికి స‌భ్యులు ఆమోదం తెలిపారు. అయితే.. ఇది రాజ్యాంగ‌ప‌ర‌మైన కీల‌క నిర్ణ‌యం కావ‌డంతో గ‌వ‌ర్న‌ర్ చేతిలో ఏమీ ఉండ‌దు. నేరుగా రాష్ట్ర‌ప‌తి దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాతే రిజ‌ర్వేష‌న్ల‌పై అమ‌లు నిర్ణ‌యం తీసుకుంటారు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డికి ప్ర‌తిబంధ‌కంగా మారింది. రాష్ట్ర‌ప‌తికి ఈ బిల్లు పంపించి వారాలు నెల‌లు అయినా.. ఆమె నుంచి స్పంద‌న రాలేదు.

స‌హ‌జంగానే రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించిన అంశాల‌పై రాష్ట్ర‌ప‌తి కూడా.. ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోవాలి. లేక‌పోతే.. దీనిని సాకుగా చూపి ఇత‌ర రాష్ట్రాలు కూడా అదే విధానం పాటించే అవ‌కాశం ఉంటుంది. అయితే.. మ‌రోవైపు హైకోర్టు స్థానిక ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 90 రోజుల్లో ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని గ‌డువు విదించింది. దీంతో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌న్న సీఎం రేవంత్ రెడ్డి ఆశ‌లు ఎలా నెర‌వేర‌తాయ‌న్న ప్ర‌శ్న తెర‌మీద‌కి వ‌చ్చింది.

దీనికి సంబంధించి మూడు అంశాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

1) రాష్ట్రప‌తి నిర్ణ‌యం వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం.
2) పాత ప‌ద్ధ‌తిలోనే రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌డం. అప్పుడు మొత్తం రిజ‌ర్వేష‌న్లు 50 లోపే ఉంటాయి. అదే కొత్త బిల్లు ప్ర‌కారం అయితే.. 56 శాతం వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్ అమ‌ల్లోకి వ‌స్తుంది.
3) త‌మ పార్టీ వ‌ర‌కే రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌డం. ఈ మూడు అంశాల‌పై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.