ఆంధ్రా బిర్యానీపై కవిత నోటా తండ్రి మాటలే!

అదేంటో తెలియదు గానీ… బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని కుదేలైపోయిన టీఆర్ఎస్ కు ఆది నుంచి ఏపీ అంటే ఒకింత వ్యతిరేక భావంతోనే ఉందని చెప్పక తప్పదు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కోరుకుంటూ ఏర్పాటైన టీఆర్ఎస్ కు ఏపీపై ఓ మోస్తరు వ్యతిరేకత సర్వసాధారమే కానీ,… మరీ ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లపైనా ఆ భావనను చూపడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతంది. అప్పుడెప్పుడో తెలంగాణ సీఎం హోదాలో ఉండగానే… ఆంధ్రా బిర్యానీని పేడతో పోల్చారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పుడు ఆయన కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా గురువారం తన తండ్రి నోట వచ్చిన మాటలనే తిరిగి వల్లె వేశారు.

పోలవరం- బానకచర్ల ప్రాజెక్టుపై స్పందించేందుకు గురువారం ఉదయం బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో మన కేసీఆర్ ఎప్పుడో చెప్పేశారు కదా అంటూ ఆమె ఆంధ్రా ఫుడ్ ను అవహేళన చేశారు. బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ మాత్రమే అన్నట్లుగా ఆమె సంచలన కామెంట్లు చేశారు. బానకచర్ల ప్రాజెక్టు మీద చర్చించేందుకు చంద్రబాబు ను రేవంతే హైదరాబాద్ కు స్వయంగా పిలిచారని, ఈ భేటీ చంద్రబాబు ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే జరిగిందని కూడా ఆమె ఆరోపించారు.

ఇక నాడు చంద్రబాబుతో హైదరాబాద్ లో కలిసిన రేవంత్.. చంద్రబాబు చెప్పిన ప్రతి మాటకూ డూడూ సరేనని తలూపేశారని కవిత ధ్వజమెత్తారు. బాబు చెప్పిన ఏ ఒక్క మాటను కూడా రేవంత్ వ్యతిరేకించలేదని కూడా ఆమె ఆరోపించారు. ఈ లెక్కన చంద్రబాబును హైదరాబాద్ కు పిలిచిన రేవంత్… ఆయనకు కడుపునిండా హైదరాబాద్ బిర్యానీ పెట్టి ఆపై గోదావరి జలాలను చేతిలో పెట్టి పంపారని కవిత ఆరోపించారు. సాదారణంగా చంద్రబాబుకు అవసరం పడితే.. రేవంత్ ను పిలిచి ఆయనకు ఇష్టమైనవి పెట్టి, ఆయనను సంతృప్తి పరిచి అనుకున్న పనిని ముగిస్తారు కదా. అయితే బానకచర్ల విషయంలో మాత్రం కవిత చెప్పిన లాజిక్ ఇందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం.