జ‌గ‌న్‌ పై కీల‌క నిర్ణ‌యం దిశ‌గా కూట‌మి..

జగన్ దూకుడుకి కళ్లెం ఎలా వేద్దాం? ఇదీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కీలక చర్చ. విపక్షంలో ఉండగా సాధారణంగా ప్రజల మధ్యకు రావడం అనేది పార్టీలకు అవసరం. దాన్ని ఎవరు కాదనలేని విషయం కూడా. అయితే జగన్ పర్యటనలకు భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతుండడం, తీవ్రస్థాయిలో యువత కూడా వస్తున్న నేపథ్యంలో కొన్ని వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. పొదిలి పర్యటనలో మహిళలపై రాళ్లు చెప్పులు విసిరారు.

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంటపాళ్ల గ్రామంలో ఏకంగా ఇద్దరు మృతి చెందిన ఘటన, అదే సమయంలో మరో వ్యక్తి అంబులెన్స్ లో మృతి చెందిన ఘటన కూడా చర్చకు వచ్చాయి, అయితే వీటిని చూపించి జగన్ పర్యటనలకు బ్రేకులు వేయాలనేది సర్కారు ఆలోచన, కానీ ఈ రెండు పరిణామాలను చూపించి జగన్ పర్యటనలకు బ్రేకులు వేసే అవకాశం ఉండకపోవచ్చు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు, ఎందుకంటే ఈ రెండు పర్యటనలో కూడా జగన్ ప్రమేయం నేరుగా ఎక్కడా కనిపించడం లేదు.

అటు రెంటపాళ్లలో డ్రైవర్ నిర్వాకం కావచ్చు లేదా విచ్చలవిడిగా రెచ్చిగిపోయిన కార్యకర్తల వల్ల కావచ్చు దాంతో ప్రమాదం సంభవించింది. వ్యక్తి మరణించాడు. అదేవిధంగా గుండెపోటుతో ఒకరు చనిపోయారు. ఇంకొకటి అంబులెన్స్ లో జరిగింది. వీటికి ప్రత్యక్షంగా జగన్ కారణం కాదు అనేది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇక పొదిలి పర్యటన విషయాలు తీసుకుంటే అక్కడ కూడా మహిళలపై రాళ్లు రువ్వారు. చెప్పులు వేశారు. ఈ ఘటనకు జగన్‌కు కూడా ఎలాంటి సంబంధం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలను చూపించి జ‌గ‌న్ పర్యటనలను అడ్డుకునే పరిస్థితి లేదనేది వారు చెబుతున్న వాదన. ఒకవేళ ఈ రెండు అంశాలను చూపించి అడ్డుకుంటే రేపు న్యాయపరమైన చెక్కులు వచ్చే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. జగన్ పర్యటనలను అడ్డుకునే అంశంపై చాలా లోతుగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అడ్డుకునే అవకాశం లేనప్పుడు పరిమిత సంఖ్యలో కార్యకర్తలు నాయకులు అనుమతించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఉన్నట్టుగా అయితే జగన్‌కు ఫ్రీడం ఇకముందు ఉండకపోవచ్చు అని పరిశీలకులు భావిస్తున్నారు.