ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న రాజకీయాలకు ఇప్పటివరకు సీనియర్ నాయకులు ఎవరు పెద్దగా స్పందించలేదు. ఎవరు కూడా ఆమె చేస్తున్న ఏకపక్ష రాజకీయాలను సమర్ధించలేదు. అంతేకాదు, వీటిని ఏకపక్ష రాజకీయాలు అంటూ సాకే శైలజానాథ్.. అదేవిధంగా మరికొందరు నాయకులు బయటకు వచ్చేసారు. దీంతో షర్మిల చేస్తున్న రాజకీయాలపై ఆ పార్టీలో తరచుగా చర్చ జరుగుతూనే ఉంది. ఆమెకు మద్దతుగా ఎవరు నిలవకపోవడం, ఆమె ప్రెస్ మీట్ లు పెట్టిన ఎవరూ రాకపోవడం ధర్నాలు నిరసనలకు కూడా పెద్దగా జన సమీకరణ లేకపోవడం వంటివి గమనిస్తూనే ఉన్నాం.
సోదరుడు జగన్‌పై చేస్తున్న రాజకీయ యుద్ధం వెనుక ఆస్తులు వివాదాలు, సొంత అజెండా ఉందన్న ప్రచారం కూడా జోరుగానే ఉంది. ఈ క్రమంలో షర్మిలకు మద్దతుగా ఆ పార్టీ నుంచి పెద్దగా ఎవరు మద్దతు పలికేందుకు ముందుకు రాలేదు. తాజాగా ఈ పరిణామాలకు ఒక యూటర్న్ పడింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అనూహ్యంగా జగన్ పై విరుచుకు పడడం గమనిస్తున్నాం. గడిచిన రెండు రోజులుగా మాణిక్యం ఠాకూర్ జగను టార్గెట్ చేస్తున్నారు. వరుసగా ఆయన పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు సంచలనంగా మారాయి.
రెంటపాళ్లలో జరిగిన ప్రమాదంపై స్పందించిన మాణిక్యంఠాకూర్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తీవ్ర నేర స్వభావం కలిగిన వ్యక్తిగా, కుట్రపూరిత రాజకీయాలు చేయగలగడంలో నేర్పరిగా జగన్ ను పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా షర్మిలకు కలిసి వచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మాణిక్యం చేసిన వ్యాఖ్యలు జగన్ ఇమేజ్‌ను బాగా దెబ్బకొట్టాయి.
క్రిమినల్ నేరాలు చేయడంలో, ఆర్థిక వ్యవస్థీకృత నేరాలు చేయడంలో జగన్ ను మించిన నాయకుడు ఈ దేశంలో లేడంటూ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా ప్రచారానికి వచ్చాయి. అదే విధంగా రాష్ట్రంలో జగన్ చేసిన దోపిడి దేశంలో ఇంకెక్కడ జరగలేదు అని కూడా మాణిక్యం వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటివరకు జగన్ పై ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు భారీ మద్దతు లభించినట్లయింది.
భవిష్యత్తులోనూ ఇదే దూకుడు కొనసాగిస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటికిప్పుడు అయితే షర్మిల వాదనకు మాణిక్యం మద్దతు పలికారు. అంటే ఒక రకంగా ఇప్పటివరకు షర్మిల తన సొంత అజెండాను అమలు చేస్తుందని భావించిన వారికి ఇది సొంత అజెండా కాదు అధిష్టానం సూచనల మేరకే ఆమె జగన్ పై పోరాడుతున్నారన్న సంకేతాలను బలంగా ఇచ్చినట్టు అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates