వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కేసుల చట్రం ఉచ్చు బిగుసుకుంటోందా? అన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. తాను విపక్ష నేతనంటూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాను రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా పర్యటించే హక్కు తనకుందని చెబుతున్న జగన్… ఆయా పర్యటనల్లో పోలీసు ఆంక్షలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగానే మొన్నటి రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద నలిగి చనిపోయారు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు… జగన్ సహా ప్రమాద సమయంలో కారులో ఉన్న డ్రైవర్ ఇతర వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా మంగళవారం వారందరికీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను అందించేందుకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన నల్లపాడు, గుంటూరు పోలీసులు పార్టీ కార్యాలయ ఇంచార్జీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి అందజేశారు. అంతటితో ఆగని పోలీసులు.. ప్రమాదానికి కారణమైన జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా సీజ్ చేస్తున్నామని చెప్పి.. ఆ నోటీసునూ అప్పిరెడ్డి చేతిలో పెట్టి కారును తీసుకెళ్లిపోయారు.
ఈ కేసు విచారణ ముగిసే దాకా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు జగన్ కు తిరిగి ఇచ్చే సమస్యే లేదు. మరి జగన్ బయటకు వెళ్లాలంటే ఎలా? బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండానే ఆయన బయటకు వెళ్లక తప్పదు. రాష్ట్ర పర్యటనలు అలా పక్కనపెడితే… తాడేపల్లి నుంచి బెంగళూరుకు జగన్ నిత్యం చక్కర్లు కొడుతున్నారు. మరి ఈ పర్యటనలకు జగన్ ఏ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడతరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరు పరిస్థితిని పక్కనపెడితే.. తాడేపల్లి నుంచి గన్నవరం దాకా జగన్ సాధారణ వాహనంలోనే ప్రయాణించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే… ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసులో అరెస్టై చంచల్ గూడ జైలు నుంచి నాంపల్లి కోర్టుకు వచ్చేందుకే బుల్లెట్ ప్రూఫ వాహన సౌకర్యం కల్పించాలని జగన్ సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎదుటే బైఠాయించారు. ఆ సందర్భంగా జగన్ అభ్యర్థనకు సీబీఐ కోర్టు సరేననడంతో నాడు ఆ సమస్య పరిష్కారం అయ్యింది. నాడు ప్రత్యేక పార్టీ కూడా పెట్టని జగన్ కోర్టులనే తన మాట వినేలా బ్లాక్ మెయిల్ చేశారు. మరి ఇప్పుడు ఉన్న ఒక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్ కాగా… జగన్ ఎలా తాడేపల్లి దాటి బయటకు వస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates