నిజమేనండోయ్…ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇకపై జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత లబించే ఛాన్సులు కనిపించడం లేదు. ఏపీ హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్ పై మంగళవారం జరిగిన విచారణ తీరును గమనిస్తే… ఈ మాట నిజమేనని నమ్మక తప్పదు. ఎందుకంటే.. జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించేంత ముప్పేమీ లేదని, అసలు జగన్ కు ఎలాంటి ప్రాణహానీ లేదని కేంద్ర హోం శాఖతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ శాఖ కోర్టుకు తెలిపాయి.
జగన్ 2014లో ప్రదాన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత లేదు. అయితే 2019లో సీఎం కాగానే…ఆ హోదాకు తగ్గట్టుగా కేంద్రం జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. సీఎంగా జగన్ దిగిపోయిన తర్వాత కూడా జెడ్ ప్లస్ భద్రత కొనసాగింది గానీ… ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్… రాజకీయ ప్రసంగం చేశారు. ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన కేంద్రం ఈ పర్యటనలో జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించింది.
ఈ పరిణామంతో ఆందోళన చెందిన జగన్ తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన నాడే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు…కేంద్ర హోం శాఖతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. జగన్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని వాటిలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసులకు తాజాగా ఆ రెండు సంస్థలు స్పందించి… తమ స్పందనను తెలియజేశాయి.
జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించే అవసరం లేదని, సాధారణ భద్రత సరిపోతుందని కేంద్ర హోం శాఖ తన అఫిడవిట్ లో కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా జగన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాణ హానీ కూడా లేదని బీజేపీ కీలక నేత అమిత్ షా నేతృత్వంలోని ఆ శాఖ తేల్చిచెప్పింది. ఇంటెలిజెన్స్ శాఖ కూడా ఇదే భావనలలో కూడిన అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లను పరిశీలించిన కోర్టు…ఈ విషయాలపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates