బానకచర్లపై రేవంత్ నయా వ్యూహం!

ఏపీ ప్రతిపాదిస్తున్న పోలవరం-బానకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని ఓ మోస్తరుగా మార్చుకున్నారని చెప్పాలి. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేబినెట్ భేటీ తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడతామని, అవసరమైతే ఈ చర్చల ప్రక్రియకు తామే ఓ అడుగు ముందుకు వేస్తామని కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్నట్లుగానే సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో రేవంత్ మాట మార్చేశారు. ముందుగా బానకచర్ల పై కాంగ్రెస్ లేజస్లేచర్ పార్టీ(సీఎల్పీ) సమావేశంలో చర్చించిన మీదట తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

అయితే ఈ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని రేవంత్ చెప్పలేదు. ఇక ఈ సమావేశంలో ఏం చర్చిస్తామన్న విషయాన్ని మాత్రం రేవంత్ చెప్పుకొచ్చారు. బానకచర్లపై ఇప్పటిదాకా ఏం జరిగిందన్న దానిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. అంటే… బానకచర్లపై ఇకపై రేవంత్ సర్కారు తీసుకునే ఏ నిర్ణయం అయినా మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నట్లేనన్న భావన కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి బానకచర్లపై రేవంత్ ఏ నిర్ణయం తీసుకున్నా…విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇక సొంతపార్టీలోని కొందరు నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుపై తానొక్కడినే ఎందుకు నిర్ణయం తీసుకోవాలి? మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది కదా అన్న భావనలో రేవంత్ అడుగులు వేసినట్లు సమాచారం. బానకచర్లపై అయినా, ఇంకే ప్రాజెక్టుపై అయినా తానొక్కడినే నిర్ణయం తీసుకోవడం కంటే పార్టీ మొత్తంగా… కేబినెట్టే నిర్ణయం తీసుకుంటే పోతుంది కదా అన్నట్లు రేవంత్ సాగుతున్నారు.

బానకచర్ల ఇప్పుడే ప్రారంభమైన ప్రాజెక్టు అయితే కాదు. 2019లో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టు పేరిట ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు శరవేగంగా చేపట్టారు. ఈ విషయం తెలిసి కూడా నాటి కేసీఆర్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ ఈ పనులను ఆపలేదు కదా. రాత్రింబవళ్లు పనులు చేయించి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయాలని తలచారు. అయితే పర్యావరణ ప్రేమికులు కోర్టుకు ఎక్కడంతో కోర్టు ఆదేశాలతో జగన్ సర్కారు పనులను ఆపేసింది. సీఎల్పీలో కాంగ్రెస్ సభ్యులకు ఇవన్నీ వివరించే అవకాశం రేవంత్ కు దక్కుతుంది.