తాజాగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా కీలకమైన సందేశాన్ని ఇచ్చారని చెప్పాలి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కూటమి ఐక్యత పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తర్వాత కూడా కూటమి బలంగా ఉందని చంద్రబాబు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు, అంతేకాదు ఎక్కడ ఒడిదుడుకులు లేవని ఏడాది కాలంలో ఎలాంటి ఇబ్బంది రాలేదని కూడా చంద్రబాబు చెప్పారు, భవిష్యత్తులోనూ తమ కోటమి కొనసాగుతుందని తెలిపారు.
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని చెబుతూ.. మరింత గట్టిగా కూటమి ఐక్యతను చాటారు. అంతేకాదు వైసీపీని నేరుగా ఆయన టార్గెట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాదు అని బల్లగుద్ది మరి చెప్పారు. వచ్చే ఎన్నికల్లోను కూటమి బలంగా ముందుకు వెళుతుందని, వైసీపీకి అధికారం కలలేనని స్పష్టం చేశారు. తామంతా కలివిడిగా ఉన్నామని, ఎక్కడ ఎలాంటి విభేదాలు లేవని రావని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలు వైసీపీలో తీవ్ర ప్రకంపనలే సృష్టించాయి.
ఎందుకంటే గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలవకూడదని, కలవరాదని వైసీపీ అధినేత జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. చంద్రబాబును పవన్‌ను దూరం పెట్టేందుకు ఇటు సోషల్ మీడియా అటు బహిరంగ వేదికలపై కూడా ఇద్దరినీ టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. సామాజిక వర్గాలపరంగా కూడా కాపు నాయకులను కొందరిని రంగంలోకి దింపి రాజకీయాలు సాగించారు. అయినా గత ఎన్నికల్లో రెండు పార్టీలు కలిశాయి. ఫలితంగా వైసిపి 40% ఓటు బ్యాంకు తెచ్చుకున్న ఓడిపోయింది.
ఈ పరిస్థితుల్లో కూటమిలో బేదాభిప్రాయాలు ఏర్పడి, కూటమి విచ్ఛిన్నమైతే తప్ప తమకు అవకాశం లేదని వైసిపి గత ఎన్నికల సమయంలోనే గ్రహించింది, అందుకే తరచుగా ఇటు జనసేనలో కానీ అటు టిడిపిలో కానీ మరోవైపు బిజెపిలో కానీ వ్యక్తిగతంగా నాయకులు ఎవరైనా చిన్న మాట అన్నా దానిని హైలెట్ చేస్తూ ప్రచారం చేస్తుంది. ఇటీవల ఒక బీజేపీ నాయకుడి పై జనసేన నాయకుడు విరుచుకుపడ్డాడు. ఈ విషయాన్ని వైసిపి మీడియా తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది.
ఇలా మూడు పార్టీల మధ్య ఏదో ఒకచోట విభేదాలు రావడం ఖాయమని అది తమ లాభిస్తుందని వైసిపి అంచనా వేసింది. కానీ తాజా పరిణామాలతో తామంతా కలిసే ఉన్నామని ఎట్టి పరిస్థితుల్లో వైసిపికి అధికారం దక్కనివ్వమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన తరువాత వైసిపి ఒకరకంగా దిగాలు పడిందని చెప్పాలి. అయితే బిజెపితో ఉన్న సత్సంబంధాల కారణంగా వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా వ్యూహం మార్చుకుని అడుగులు వేస్తే అప్పుడు మాత్రం వైసీపీకి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates