వరంగల్‌గా పిలుచుకుని ఓరుగల్లు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ల నుంచి పెద్ద ఇబ్బందే వచ్చింది. వ్యక్తిగత వైషమ్యాలు.. వివాదాలు.. ముసురుకున్న నాయకత్వం.. ఒకరి పై ఒకరు మాటల యుద్ధాన్ని చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్ లపై స్థానిక సీనియర్ నాయకులు ఎలుగెత్తారు. “వారు కావాలో.. మేం కావాలో తేల్చుకోండి!” తేల్చుకోవాలని పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం.. పార్టీకి కొండంత భారంగా మారింది.
ఏం జరుగుతోంది?
వరంగల్ రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. అధికార పార్టీలో ఉన్న వారిలోనే వివాదాలు సాధారణం. గత బీఆర్ ఎస్ హయాంలోనూ ఇలానే నాయకులు కొట్టాడుకున్నారు. అప్పటి బీఆర్ ఎస్ నాయకుడు కడియం శ్రీహరిపై.. అప్పటి బీఆర్ ఎస్ నేత, ఎస్సీ నాయకుడు తాటికొండ రాజయ్యల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇలానే.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల మధ్య కూడా వివాదాలు తారస్థాయిలో సాగుతున్నాయి.
ముఖ్యంగా కడియం శ్రీహరి.. రెండు పార్టీలు మారి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి రావడాన్ని కొండా వర్గం జీర్ణించు కోలేక పోతోంది. పైగా.. సురేఖ మంత్రిగా ఉండడం.. ఆమె భర్త అన్నీ తానై చక్రం తిప్పుతుండడంతో రాజకీయాలు మరింత సెగ పుట్టిస్తున్నాయి. దీనికి తోడు.. సురేఖ, మురళీ దంపతులు.. తాము లేకపోతే జిల్లాలో పార్టీనే లేదన్నట్టు వ్యాఖ్యానిస్తున్నారన్నది కడియం సహా ఎమ్మెల్యేలు.. రేవూరి ప్రకాష్‌రెడ్డి, నాయిని రాజేంద్ర రెడ్డి వంటివారు చేస్తున్న వ్యాఖ్యల్లో స్పష్టంగా తెలుస్తోంది. మొత్తంగా సీనియర్లకు.. కొండా కుటుంబానికి మధ్య వార్ నడుస్తోంది.
ఈ క్రమంలో తాజాగా వారంతా.. పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. తాము పార్టీలో ఉండాలంటే.. కొండా వర్గాన్ని అదుపు చేయాలన్నది వారు చెబుతున్న మాట. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కూడా కోరుతున్నారు. అయితే.. లాగినా.. తెంపినా.. ఇది ప్రమాదమని భావిస్తున్న పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. మద్యే మార్గంగా.. క్రమశిక్షణ సంఘాన్ని నియమిస్తామని.. ఆ సంఘం చెప్పినట్టు చేస్తామని.. ప్రస్తుతాన్ని మండుతున్న మంటపై నీళ్లు చల్లారు. కానీ, ఇది ఇప్పట్లో ఆగేలా అయితే.. కనిపించడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates