లోకేష్, ఈ ముగ్గురునీ కాస్త చూడాలి

కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు మంత్రివర్గంలో నారా లోకేష్ ‘టీం’గా పేర్కొనే ఒకరిద్దరు నాయకులు వెనకబడ్డారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా చేసిన సర్వేల్లో పది మంది మంత్రులు పనితీరులో వెనుకబడ్డారు. వీరిలో సీనియర్ మంత్రులు, జూనియర్ మంత్రులు కూడా ఉన్నారు. సీనియర్ల విషయాన్ని పక్కన పెడితే, తొలిసారి మంత్రులు అయిన వారిలో ముగ్గురు చాలా వెనకబడ్డారనేది ప్రజలు చెబుతున్న మాట. ఈ ముగ్గురు ‘లోకేష్ టీం’ అని పార్టీలో చర్చ ఉంది. ఎన్నికలకు ముందు నుంచే వారు నారా లోకేష్‌తో బాగా చనువుగా ఉండడం, ‘యువగళం’ పాదయాత్రకు మంచి సపోర్ట్ చేయడంతో వారిని లోకేష్ టీం‌గా చూస్తారు.

ఇప్పుడు వారు తమ పనితీరులో వెనుకపడ్డారని సర్వేల ద్వారా తెలుస్తోంది. వీరిలో కర్నూలు ఎమ్మెల్యే, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాసంశెట్టి సుభాష్, కడప జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. తాజాగా చేపట్టిన కేకే సర్వే, అలాగే రైజ్ సంస్థ చేసిన సర్వేల్లో ఈ ముగ్గురు బాగా వెనకబడినట్లు వెల్లడైంది.

ప్రజల అభిప్రాయాలను తీసుకున్నప్పుడు టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రిగా పెద్దగా పనితీరు చూపించలేకపోయారని 49 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, మంత్రిగా ఆయన దూకుడుగా లేరని 32 శాతం మంది అభిప్రాయపడ్డారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విషయానికొస్తే, ఆయన పనితీరు మీద ప్రజల నుంచి పెదవి విరుపే కనిపించింది.

వీరిని పక్కన పెడితే, తరచుగా మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసే వాసంశెట్టి సుభాష్ పనితీరు కూడా అదే స్థాయిలో ఉందని ప్రజల అభిప్రాయం. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసంశెట్టి విపక్షాలపై విమర్శలు చేయడంలోనూ, దూకుడుగా వ్యాఖ్యానాలు చేయడంలోనూ ముందుంటారు. కానీ పనితీరులో మాత్రం వెనకబడ్డారని సర్వేలు చెబుతున్న మాట.

వ్యక్తిగతంగా వీరు ఎలా ఉన్నా, ‘లోకేష్ టీం’ అనే ముద్రపడడంతో వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. తమ పనితీరును మెరుగుపరచుకోవడంతో పాటు మంత్రులుగా కీలక నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.

చిత్రం ఏంటంటే, అంతర్గత సర్వేల్లోనూ ఈ ముగ్గురూ వెనుకబడి ఉండడం. గతంలోనే చంద్రబాబు రెండు సందర్భాల్లో వీరిని హెచ్చరించారు. ఇప్పుడు ప్రజల అభిప్రాయం కూడా అదే దిశగా ఉన్నందున, వీరు తమను తాము మెరుగుపర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.