రాజధాని అమరావతిని వేశ్యలతో పోల్చుతూ.. తీవ్ర వివాదాస్పద, దారుణ వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కృష్ణం రాజును పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటల వరకు విచారించారు. ప్రస్తుతం ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేయడంతో మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని.. దీనిని ఛేదించాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొంటూ.. కృష్ణంరాజును మూడు రోజుల పాటు కోర్టు అనుమతితో తమ కస్టడీకి తీసుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నమే కోర్టు అనుమతి ఇచ్చినా.. సాయంత్రం వరకు ఉత్తర్వులు రాలేదు. దీంతో రాత్రి పొద్దు పోయిన తర్వాత .. తమ అదుపులోకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు.. ఆయనను రాజధాని ప్రాంతమైన మందడం పోలీసు స్టేషన్‌కు తరలించి రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు విచారించారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు రెండు బృందాలుగా ఏర్పడి ఆయనను ప్రశ్నించారు. ఈ క్రమంలోఆయన బ్యాంకు ఖాతాలు, అందిన నగదు రిసీట్‌లను చూపించి.. ఈ సొమ్ములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తనకు సాక్షి నుంచే నిధులు అందేవని.. నెల నెలా వేల రూపాయలు ఇచ్చేవారని చెప్పారు. తాను సాక్షిలోనే కాకుండా..ఇతర చానెళ్లలో కూడా.. విశ్లేషకుడిగా వ్యాఖ్యానాలు చేస్తున్నట్టు చెప్పారు.
అదేవిధంగా ఏపీ జర్నలిస్టు యూట్యూబ్ చానెల్ కూడా తనకు ఉందని కృష్ణంరాజు తెలిపారు. దీనికి కూడా సాక్షి వాళ్లే పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. అయితే.. రాజధాని మహిళలను అవమానించాలని ఆ వ్యాఖ్యలు చేయలేదన్న కృష్ణం రాజు.. సీఎం చంద్రబాబుపై తనకు ఉన్న కసి, కక్షతోనే తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనికృష్ణం రాజు వెల్లడించారు. చంద్రబాబు తన జీవితంతో ఆడుకున్నట్టు తెలిపారు. తాను ఓ ఆంగ్ల పత్రికలో పనిచేసినప్పుడు.. ఆయన పాలనకు వ్యతిరేకంగా కథనాలు రాసినట్టు చెప్పారు. దీనిపై కక్ష కట్టిన చంద్రబాబు.. తనను పదే పదే బదిలీలు చేయించారని.. చివరకు ఉద్యోగం పోయేలా కూడా వ్యవహరించారని చెప్పారు.
దీంతోనే చంద్రబాబుపై తనకు కసి, కక్ష పెరిగిందన్నారు. ఈ క్రమంలోనే తాను అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్నారు. అయితే..తాను చేసిన వ్యాఖ్యలకు సాక్షి యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఐదు సంవత్సరాలుగా సాక్షిలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నానని చెప్పారు. తాను చేసింది తప్పేనన్న కృష్ణంరాజు.. ఉద్దేశ పూర్వకంగా చేయలేదని.. చంద్రబాబుపై కోపంతోనే మాట తూలానని వ్యాఖ్యానించారు. అయితే.. పోలీసుల అడిగిన పలు ప్రశ్నలకు సంబంధించి ఆయన దాటవేత ధోరణిని అవలంభించినట్టు తెలిసింది. కాగా, శనివారం, ఆదివారం కూడా ఆయనను పోలీసులు విచారించనున్నారు. విచారణ సమయంలో ఆయనను కొట్టవద్దని, న్యాయవాదిని అనుమతించాలని కోర్టు సూచించింది. దీంతో న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిగినట్టుపోలీసు అధికారి ఒకరు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates