ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన బాగుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. 51 శాతం మంది ప్రజలు ప్రభుత్వ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా రైజ్ అనే సంస్థ ఏడాది కూటమి పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. దీనికి సంబంధించిన రిపోర్టును శుక్రవారం విడుదల చేసింది. ప్రజలు ఏమనుకుంటున్నారు? పాలన తీరు ఎలా ఉంది? మంత్రులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? అనే కీలక అంశాలపై ఈ సర్వే ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది.
దీని ప్రకారం 51 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో 11 శాతం మంది మాత్రం ఇప్పుడే చెప్పలేమని మరో రెండేళ్లు ఆగాలని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అయిందని ఎక్కువగా అభిప్రాయపడ్డారు. ఇప్పుడే ఎలాంటి అభిప్రాయానికి రాలేమన్నవారు 11 శాతం మంది ఉన్నారు. ఇక గత వైసీపీ సర్కారు పనితీరు బాగుందని 38 శాతం మంది ప్రజలు అభిప్రాయపడడం గమనార్హం. ఇక ముఖ్యమంత్రిగా పాలన విషయంలో చంద్రబాబుకు మంచి మార్కులే పడ్డాయి. ఆయన పాలన తీరు బాగుందని 50 శాతానికి పైగా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే సంక్షేమ పథకాలతో పోల్చి చూస్తే మాత్రం జగన్ కంటే కూడా చంద్రబాబు 3 శాతం మార్కుల మేరకు వెనకబడ్డారు. సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు బెస్టా? జగన్ బెస్టా? అని ప్రశ్నించినప్పుడు జగనే బెస్ట్ అని ఎక్కువ మంది చెప్పడం గమనార్హం. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు 48 శాతం అనుకూలంగా ఉంటే జగన్‌కు అనుకూలంగా 52 శాతం మంది పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో చంద్రబాబు సహా కూటమి ప్రభుత్వం ఒకింత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకున్నవారికి అవి అందడం లేదా అనే కోణంలో సీఎం దృష్టి పెడితే ఈ స్వల్ప తగ్గుదలను అధిగమించడం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు.
ఇక రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం చంద్రబాబుకు భారీ ఎత్తున ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. 59 శాతం మంది ప్రజలు ఆయన వల్ల రాష్ట్రం డెవలప్ అవుతుందని పేర్కొన్నారు. ఆయన ఉంటే రాష్ట్రం ప్రపంచ స్థాయికి చేరుతుందని తెలిపారు. ఇక జగన్ పాలనలో జరిగిన అభివృద్ధిపై కేవలం 41 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దాదాపు 18 శాతం తేడా చూపిస్తోంది. అంటే విజన్ ఉన్న నాయకుడిగా అభివృద్ధి చేసే సీఎంగా చంద్రబాబుకు భారీ ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభించిందనే ఈ సర్వేలో ప్రజలు తేల్చి చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates