ఒక కృషి-ఒక పట్టుదల ఉంటే విజయం దానంతట అదే వరిస్తుందని చెప్పడానికి తాజాగా విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవమే పెద్ద ఉదాహరణ. దీనిని ప్రపంచ దేశాలు మెచ్చేలా చేయాల ని.. గిన్నిస్ రికార్డు సాధించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నెల రోజుల ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవాలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆయన ఆహ్వానించారు. దీంతో దీనికి మరింత హైప్ పెరిగింది.
అంతేకాదు.. దగ్గర ఉండి.. కార్యక్రమాల నిర్వహణను కూడా సీఎం చంద్రబాబు పర్యవేక్షించారు. ప్రతి విషయాన్నీ నిశితంగా గమనించారు. ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు లేకుండా, రాకుండా చూసుకున్నారు. సుమారు 5 లక్షల మందితో విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి 29 కిలో మీటర్ల దూరంలోని భీమిలి నియోజక వర్గంలోని తీరం వరకు నిర్వమించిన ఈ యోగా కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా.. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
దీంతో యోగాంధ్ర-2025 రికార్డు సృష్టించింది. విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు చీమల దండు మాదిరిగా యోగా వేసేందుకు వచ్చిన వారు క్యూ కట్టారు. ప్రత్యేక శిక్షకుల ద్వారా ప్రతి 10 వేల మందికి ఒకరు చొప్పున నియమించి.. యోగాసనాలు వేయించారు.
ప్రపంచ రికార్డు!
తాజాగా విశాఖలో నిర్వహించిన యోగా కార్యక్రమం రికార్డు సృష్టించింది. గతంలో గుజరాత్‌లోని పారిశ్రా మిక పట్టణం సూరత్‌లో నిర్వహించిన యోగాలో 1.47 లక్షల మంది పాల్గొన్నారు. ఇదే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. తాజాగా నిర్వహించిన విశాఖ యోగాలో ఏకంగా 3 లక్షల 10 వేల మంది పాల్గొని యోగాసనాలు వేశారు. దీంతో అన్ని రికార్డులను చెరిపేసి.. సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదంతా.. చంద్రబాబు కృషి, పట్టుదలకు నిదర్శనమని.. విశాఖ వాసులు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates