సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు శుక్రవారం తమ అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి కోర్టు గురువారం రాత్రి మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఆయనను అనుమతించింది. దీంతో శుక్రవారం గుంటూరు జైలుకు వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే.. పోలీసుల కస్టడీలో తనను కొట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని కృష్ణంరాజు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే.. దీనికి రక్షణ కల్పిస్తూ.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును ప్రశ్నించనున్నారు. అమరావతి రాజధానిని వేశ్యల రాజధానితో పోల్చుతూ.. ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కూపీ లాగనున్నారు. ఈ నెల 6న వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో జరిగిన డిబేట్‌లో కృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఎట్టకేలకు ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజును పోలీసులు శ్రీకాకుళంలో అరెస్టు చేసి తీసుకువచ్చారు. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా.. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారు? ఎవరి ప్రోద్బలంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? రాజధానిపై కుట్రలు ఎవరు పన్నారు? అనే కీలక విషయాలను తెలుసుకునేందుకు ఆయనను కస్టడీకి ఇవ్వాలని తుళ్లూరు పోలీసులు కోర్టును అభ్యర్థించడంతో అనుమతిఇచ్చింది. అయితే.. విచారణ సందర్భంగా ఆయనపై చేయి చేసుకోవద్దని సూచించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates