లోకేష్ శ‌భాష్‌.. విశాఖ‌కు కాగ్నిజెంట్ రాక‌!

Cognizant

ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఆయ‌న ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రిచి.. ఆహ్వానించిన ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూష‌న్స్‌.. త్వ‌ర‌లోనే ఏపీకి రానుంది. ఈ మేర‌కు తాజాగా త‌న స‌మ్మ‌తిని తెలుపుతూ.. మంత్రి నారా లోకేష్‌కు స‌మాచారం అందించింది. కాగ్నిజెంట్ టెక్ సొల్యూస‌న్స్ అనేది అమెరికాకు చెందిన కీల‌క సంస్థ‌. దీని ప్ర‌ధాన కార్యాల‌యం వాషింగ్ట‌న్‌లో ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబ‌డులు పెడుతోంది.

ఈ నేప‌థ్యంలో కాగ్నిజెంటును రాష్ట్రానికి రావాలంటూ.. కొన్నాళ్ల కింద‌ట మంత్రి నారా లోకేష్ ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. ఆ సంస్థ ప్ర‌తినిధుల‌తో ఆయ‌న రెండు సార్లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని, అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తామ‌ని కూడా చెప్పారు. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లోని కాపులుప్పాడ ప్రాంతంలో దాదాపు 21.5 ఎక‌రాల భూమిని కూడా కేటాయించారు. దీనిని ఏడాదికి ఎక‌రాకు రూ.0.99 కే కేటాయించారు.

ఈ ప్ర‌తిపాద‌న‌ల త‌ర్వాత‌.. స్థానికంగా విచార‌ణ చేసుకున్న సంస్థ‌.. తాజాగా ఏపీకి వ‌చ్చేందుకు స‌మ్మ‌తించింది.  విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు స‌మ్మ‌తి తెలిపింది. తొలి ద‌శ‌లో 1,582 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. దీనివ‌ల్ల దాదాపు 8 వేల మందికి పైగా యువ‌త‌కు ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. స్థానికంగా మ‌రిన్ని రెట్ల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి.  ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు కానుండ‌డంతో విశాఖ కీర్తి ప్ర‌పంచ దేశాల‌కు పాక‌నుంద‌ని మంత్రి నారా లోకేష్ తెలిపారు.