‘తిరుమలతో పాటు మరిన్ని ఆలయాలకూ కల్తీ నెయ్యి’

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి వాడింది అసలు నెయ్యే కాదని ఇప్పటికే ఓ నివేదిక బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల కు సరఫరా అయిన కల్తీ నెయ్యి… ఏపీలోని ప్రముఖ ఆలయాలకూ సరఫరా అయ్యిందని, ఆ ఆలయాలకూ తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీనే ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని తాజాగా తేలింది.

కల్తీ నెయ్యి వ్యవహారంలో భోలేబాబా డెయిరీ తరఫున ఆ సంస్థ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణాను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాణా ఇప్పటికే రెండు పర్యాయాలు బెయిల్ కోసం యత్నించి విఫలమయ్యారు. తాజాగా మూడో సారి కూడా ఆయన నెల్లూరు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా… దానిపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ బెయిల్ పిటిషన్ కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల మాదిరే రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాలకూ కల్తీ నెయ్యిని భోలేబాబా డెయిరీ సరఫరా చేసిందని సంచలన విషయాన్ని వెల్లడించారు.

ఇలా భోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిన ప్రముఖ ఆలయాల్లో బెజవాడ దుర్గమ్మ గుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల తదితర ఆలయాలు ఉన్నాయి. సుగంధ ఆయిల్స్, పామోలిన్ లతో కల్తీ నెయ్యిని తయారు చేసిన భోలేబాబా…దానినే తిరుమల సహా ఇతర ఆలయాలకూ సరఫరా చేసింది. ఈ సంస్థ అక్రమాలను గుర్తించి టీటీడీ 2022లో బ్లాక్ లిస్ట్ లో పెట్టినా… తిరుపతిలోని ఓ చిన్న డెయిరీని కేంద్రంగా చేసుకుని ఇతర డెయిరీల పేరుతో ఈ దందాను కొనసాగించిందని జయశేఖర్ న్యాయమూర్తికి వివరించారు. ఇంతటి నేరస్వభావం ఉన్న భోలేబాబా ప్రతినిధులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, అసలు సాక్ష్యాలే లేకుండా చేస్తారని ఆయన వాదించారు. ఏపీపీ వాదనలతో ఏకీభవించిన కోర్టు… రాణా బెయిల్ ను వరుసగా మూడో సారి తిరస్కరించింది.