తన తర్వాతి టార్గెట్ ఏమిటో చెప్పేసిన అసదుద్దీన్ ఓవైసీ

దేశంలో మత రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీపై తరచూ విరుచుకుపడే రాజకీయ పార్టీలు.. కేవలం మతం ఆధారంగానే రాజకీయాలు చేయటమే కాదు.. తమ మతస్తుల గురించి మాత్రమే మాట్లాడే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురించి కానీ ఆయన పార్టీ గురించి పెద్దగా మాట్లాడరు. ఆ మాటకు వస్తే..ఆయన్నుపెద్దగా పట్టించుకోరు. ఈ నిర్లక్ష్యానికి భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఆ మధ్యన మహారాష్ట్ర.. ఇప్పుడు బిహార్ రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ స్థానాల్ని ఆ పార్టీ సొంతం చేసుకుంది.

ముస్లిం ఓటర్లను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు నిర్వహించే ఆ పార్టీ.. తాజాగా దేశంలోని మైనార్టీ ఓటు బ్యాంక్ ను తమ పార్టీ ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ఎత్తులు వేస్తున్నారు. బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమకు లభించిన విజయంతో ఆయన మరిన్ని ప్లాన్లు వేస్తున్నారు. తమ తర్వాతి టార్గెట్ గా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ ను ఎంచుకున్నారు. దేశంలో అత్యధిక ముస్లింలు ఉన్న రెండోరాష్ట్రంగా పశ్చిమబెంగాల్ ను చెప్పాలి.

ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో టీఎంసీ.. వామపక్షాల మధ్యనే పోరు నడిచేది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. అంత ప్రభావాన్ని చూపలేని పరిస్థితి. ఇప్పుడు బీజేపీ కూడా తన బలాన్ని అంతకంతకూ పెంచుకుంటోంది. గత లోక్ సభ ఎన్నికల్లో భారీగా కాకున్నా.. ఒక మోస్తరుగా ఎంపీ సీట్లను గెలుచుకోవటం దీదీ పార్టీని కలవరపాటుకు గురి చేసింది.42 ఎంపీ స్థానాలున్న పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఏకంగా 18 స్థానాల్ని సొంతం చేసుకోవటం సామాన్యమైన విషయం కాదు.

అందునా టీఎంసీ అడ్డాలో కమలవికాసం సామాన్యమైన విషయం కాదని చెప్పాలి. ఈ గెలుపుతో బెంగాల్ అసెంబ్లీలో పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. ఇదిలా ఉంటే.. అసదుద్దీన్ ఓవైసీ కూడా బెంగాల్ అసెంబ్లీ మీద కన్నేశారు. తాను.. తన పార్టీ నడిపే మత రాజకీయాలు బెంగాల్ లో బాగా వర్కువుట్ అవుతాయన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే.. బెంగాల్ కు జరిగే ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేయాలన్న తన తర్వాతి టార్గెట్ ను వెల్లడించారు. ముంగిట్లోకి వచ్చిన గ్రేటర్ ఎన్నికల గురించి పట్టించుకోకుండా అక్కడెక్కడో అల్లంత దూరాన ఉన్న బెంగాల్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల మీద అసద్ ప్లానింగ్ సమ్ థింగ్ స్పెషల్ గా చెప్పక తప్పదు.