వైసీపీ అధినేత జగన్ మెడకు భారీ ఉచ్చే బిగుసుకుంటోంది. ఇప్పటి వరకు ఆయనను రాజకీయంగానే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం.. తాజాగా ఆయనను సీమకు కీలకమైన బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ ఇరుకున పెట్టే వ్యూహానికి తెరదీసింది. ఇప్పుడు ఆయన స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వైసీపీ అధినేత జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ.. మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన గర్జన వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందనేది పరిశీలకులు చెబుతున్న మాట. దీనిపై జగన్ నోరు విప్పాల్సిందేనన్న వాదన కూటమి పార్టీల నుంచి ఇక తీవ్రతరం కానుంది.
అసలేంటీ ప్రాజెక్టు..?
కర్నూలు జిల్లాలోని బనకచర్ల గ్రామం వద్ద సాగు, తాగు నీటి ప్రాజెక్టును నిర్మించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. వాస్తవానికి ఈ ప్రతిపాదన గతంలో లేదు. సీఎంగా చంద్రబాబు నాలుగో సారి బాధ్యతలు చేపట్టాక.. కర్నూలులో పర్యటించినప్పుడు ఈ ప్రతిపాదనకు అంకురార్పణ జరిగింది. బనకచర్లలో ప్రాజెక్టును నిర్మించడం ద్వారా గోదావరి నదీ జలాలను.. పోలవరం నుంచి బనకచర్లకు తరలిస్తారు. తద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న 1100 టీఎంసీల జలాలను ఇక్కడ ఒడిసి పట్టి కర్నూలు సహా.. సీమలోని పలుప్రాంతాలకు మళ్లిస్తారు. దీంతో ఇక్కడ సాగు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చేస్తారు. ఇదీ.. ఇతమిత్థంగా ప్రాజెక్టు స్వరూపం.
దీనికి దాదాపు 80 వేల కోట్ల రూపాయల అంచనా వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు మాత్రమే జరుగుతున్నాయి. కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వాలని.. ప్రాజెక్టును తాము నిర్మించుకుంటామని చంద్రబాబు పదే పదే ఢిల్లీ పెద్దలకు చెబుతున్నారు. అయితే.. ఈ విషయం గుప్పుమనగానే తెలంగాణ నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. అక్కడి అధికార పక్షం కూడా ఇప్పటికే కేంద్రం వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసింది. ఇక ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా.. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బనకచర్లను నిర్మించి తీరుతామన్న తమ మాట ఏమవుతోందన్న చర్చ కూడా కూటమిలో ఉంది.
జగన్ ప్రస్తావన ఎందుకు..?
అయితే.. కీలకమైన బనకచర్ల విషయంలో అఖిలపక్షాన్ని కూడగట్టి ముందుకు సాగితే.. కొన్ని ఇబ్బందులు తప్పుతాయి. అయితే.. కలిసివచ్చేందుకు వైసీపీ సిద్ధంగా లేదు. రాజకీయంగా ఉన్న వైరుధ్యాలు, వైషమ్యాల కారణంగా.. కూటమి పార్టీలకు.. వైసీపీకి మధ్య తేడా ఉంది. దీంతో సీమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. తెలంగాణ సంధిస్తున్న ప్రశ్నలకు సీమ ప్రాంతానికి చెందిన నాయకుడిగా జగన్ స్పందించాలన్నది కూటమి వ్యూహం. అందుకే.. నిమ్మల రామానాయుడు తీవ్రంగానే స్పందించారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా.. సీమ ప్రాంతానికి చెందిన నేతగా జగన్ ఎందుకు స్పందించడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే.. గతంలో తాము చేపట్టిన సీమ ఎత్తిపోతల విషయంలో టీడీపీ కలిసి రాని విషయాన్ని వైసీపీ తెరమీదికి తెస్తోంది. ఏదేమైనా.. ఇప్పుడు జగన్ చుట్టూ బనకచర్ల ఉచ్చు అయితే.. ముసురుతోంది. మరి ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారో.. చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates