కేంద్రం సమక్షంలో త్వరలో బాబు, రేవంత్ భేటీ

తెలుగు రాష్ట్రాల మద్య ఇప్పుడు పోలవరం- బానకచర్ల ప్రాజెక్టు పెద్ద సమస్యగా మారిపోయింది. గోదావరి నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల్లో కేవలం 200 టీఎంసీల వినియోగం కోసం చేపట్టే ఈ ప్రాజెక్టుతో రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ఏపీ వాదిస్తోంది. అయితే తమ ప్రాజెక్టులకు అభ్యంతరాలు తెలుపుతూ.. మాకు నష్టం కలిగించే ప్రాజెక్టును నిర్మిస్తామంటే మేమెలా ఒప్పుకుంటామంటూ తెలంగాణ వాదిస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు నేరుగా కేంద్రం వద్దకు చేరింది. 

బానకచర్లకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ కోరగా.. ఆ దిశగా కేంద్రం కూడా పరిశీలనలు మొదలుపెట్టింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దంటూ తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి కోరారు. ఈ భేటీలో తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాలుపంచుకున్నారు. తెలంగాణ వాదనలను సావదానంగా విన్న పాటిల్… ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం.

పాటిల్ తో భేటీ ముగిసిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన ఉత్తమ్… బానకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి తమ అభ్యంతరాలను సావదానంగా విన్నారని తెలిపారు. అంతేకాకుండా ఏపీ ప్రయోజనాలతో పాటుగా తెలంగాణ ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమేనని కూడా ఆయన అన్నారని పేర్కొన్నారు. ఈ దిశగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో త్వరలోనే ఓ భేటీ నిర్వహిస్తామని ఆయన చెప్పారన్నారు. ఈ భేటీ తుది ఫలితాన్ని ఇస్తుందని తాను భావిస్తున్నానని పాటిల్ అభిప్రాయపడినట్టు ఆయన తెలిపారు.

వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్న చంద్రబాబు, రేవంత్ గతంలో ఒకే పార్టీలో ఉన్నారు. చంద్రబాబు వద్దే రేవంత్ రాజకీయంగా రాటుదేలారు కూడా. ఇలాంటి నేపథ్యంలో బానకచర్ల ప్రాజెక్టుపై నెలకొన్న పీఠముడి కేంద్రం సమక్షంలో జరిగితే ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ వీడిపోనుందన్న వాదనలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.