జగన్ వేలికి ‘బాబు’ రింగు

వైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వచ్చిన జగన్ ఓ మోస్తరు వెరైటీగా కనిపించారు. సాధారణంగా జగన్ చేతులకు ఓ గడియారం తప్పించి ఇతరత్రా ఉంగరాలు గానీ, అలంకరణ వస్తువులు గానీ ఎప్పుడూ కనిపించవు. అయితే గురువారం నాటి మీడియా సమావేశంలో జగన్ తన ఎడమ చేతి మిడిల్ ఫింగర్ కు ఉంగరంతో కనిపించారు. జగన్ తన ఎడమ చేయి ఎత్తిన ప్రతిసారీ ఈ ఉంగరం ప్రత్యేకంగా కనిపించింది.

సరే… జగన్ ఇష్టం. తన వేలికి తాను ఏమైనా పెట్టుకోవచ్చు కదా. ఆ స్వేచ్ఛ కూడా ఆయన ఉంది. అయితే ఈ ఉంగరాన్ని చూసిన వారికి మాత్రం చాలా విషయాలు ఇట్టే గుర్తుకు వస్తున్నాయి. అప్పుడెప్పుడో విపక్ష నేతగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి పర్యటనకు వెళ్లిన సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో తన చూపుడు వేలిని జనానికి చూపించిన చంద్రబాబు… దానికి ఉన్న తన ఉంగరాన్ని ప్రత్యేకంగా చూపించారు.

ఆ ఉంగరం దేనితో తయారైందో గానీ.. స్టీల్ వస్తువు మాదిరిగా ఆ ఉంగరం కనిపించింది. ఆ చిన్న ఉంగరం తన పూర్తి స్థాయి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తనను అలెర్ట్ చేస్తుందని, ఈ కారణంగానే 70 ఏళ్లు మీద పడ్డా తాను ఇంకా యంగ్ గానే కనిపిస్తానని, ఆరోగ్యంగా ఉంటానని, ఆ ఉంగరం చెప్పినట్లే తాను వింటానని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు.ఈ విషయాలు నాడు తెగ వైరల్ అయ్యాయి. మరి ఆ ఉంగరం ఖరీదు ఎంతో తెలియదు గానీ… జనంలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. టీడీపీ శ్రేణులు అయితే దానిని ఓ ఫ్యాషన్ గా కూడా మలచుకున్నాయి.

ఇప్పుడు జగన్ మిడిల్ ఫింగర్ కు కనిపించిన ఉంగరం కూడా చంద్రబాబు చేతికి ఉన్న ఉంగరం మాదిరే కనిపిస్తోంది. అయితే చంద్రబాబు ఆ ఉంగరాన్ని చూపుడు వేలికి పెట్టుకుంటే… జగన్ మాత్రం దానిని తన మిడిల్ ఫింగర్ కు పెట్టుకున్నారు. రాజకీయాల్లో జగన్ కూడా చంద్రబాబు మాదిరే ఇప్పటివరకైతే ఫిట్ గానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. జగన్ తన వయసులోని రాజకీయ నేతల కంటే కూడా ఓ మోస్తరు మంచి ఆరోగ్యంతోనే ఉన్నారు. అయినా వయసు పెరుగుతోంది కదా. ఆరోగ్య పరిరక్షణ కోసం జగన్ ఈ ఉంగరాన్ని ధరించినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.