వైసీపీ అధినేత జగన్.. బుధవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నాయకుడు నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అయితే.. ఈ పరామర్శపై జగన్ సోదరి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల నిప్పులు చెరిగారు. బెట్టింగులో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే పరామర్శిస్తారా? అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెట్టింగు రాయుడికి.. విగ్రహాలు కట్టడం ఏంటి ? సమాజం ఎటు పోతోంది? అని షర్మిల నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మానేసిన జగన్.. బల ప్రదర్శనలకు దిగారని ఎద్దేవా చేశారు. ఇదేసమ యంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి బల ప్రదర్శనలకు ఎలా అనుమతులు ఇచ్చిందని షర్మిల ప్రశ్నించారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి..అన్ని అనుమతులు ఇస్తున్నారా? అని ఆమె నిలదీశారు. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్ కి మాత్రమే ఆంక్షలు విధిస్తారా? అని ప్రశ్నించారు.
జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవో సీఎంగా చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. “మాకు అర్ధం కాక మీడియా సాక్షిగా చంద్రబాబు ను అడుగుతున్నాం. మేము రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌజ్ అరెస్ట్ లు చేస్తారు. స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేస్తారు. ఆంక్షలు అన్ని కాంగ్రెస్ పార్టీకేనా?” అని ఆమె నిలదీశారు.
జగన్.. అనే వ్యక్తి ప్రధాని మోడీకి దత్త పుత్రుడు అనే కారణంగానే ఆయన పర్యటనలకు ఆంక్షలు పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. “జగన్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనా? పోలీసులను సైతం కొనుక్కోగలడు అనా?. చంద్రబాబు సమాధానం చెప్పాలి.” అని షర్మిల అన్నారు. బుధవారం నాటి వైసీపీ బలప్రదర్శన లో ఇద్దరు చనిపోయారని.. ఆయా కుటుంబాల ఆవేదనను ఎవరు అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. పోలీసులు 100 మందికి అనుమతి ఇచ్చినప్పుడు వేల మంది ఎలా వచ్చారో సర్కారు చెప్పాలని నిలదీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates