వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్మవారు వైసీపీలో ఉండకూడదా? అని ప్రశ్నించిన ఆయన.. కమ్మవారు అంతా టీడీపీలోనే ఉండాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని విమర్శించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయకూడదని కూడా బాబు కోరుకుంటారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే వైసీపీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారినంతా టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున రెంటపాళ్లకు చెందిన వైసీపీ నేత, గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ, జనసేన శ్రేణులతో కలిసి పోలీసులు దుర్మార్గానికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. గ్రామం వదిలివెళ్లకపోతే రౌడీ షీట్ తెరుస్తామని కూడా బెదిరించారని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆయన తండ్రి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేయగా… దానిని బుధవారం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడిన జగన్ టీడీపీపైనా, పోలీసుల తీరుపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇక సత్తెనపల్లిలోనే మరో వైసీపీ నేత లక్ష్మీనారాయణపై డీఎస్పీ హన్మంతరావు దుర్మార్గానికి పాల్పడ్డారని జగన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా హన్మంతరావు కమ్మ కులానికి చెందిన వారని చెప్పిన జగన్..డీఎస్పీ ఓ కుల ఉన్మాదిగా అభివర్ణించారు. లక్ష్మీనారాయణ కమ్మ కులానికి చెందిన వారు కాగా… కమ్మగా పుట్టి వైసీపీలో ఎలా కొనసాగుతావని కూడా డీఎస్పీ ఆయనను దుర్భాషలాడారని జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతల పేర్లను వరుసగా ప్రస్తావించారు. ఏం పాపం చేశారని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను లేనిపోని కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కొడాలి నాని ఏం పాపం చేశారని ఆయనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాని మాజీ ఎమ్మెల్యేగానే కాకుండా మాజీ మంత్రిగా కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
ఇలా వైసీపీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన దాదాపుగా చాలా మంది నేతల పేర్లను ప్రస్తావించిన జగన్… వారందరిపై ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ సాగిస్తున్న ఈ రెడ్ బుక్ పాలనలో అధికారులు బాగస్వామ్యం కావొద్దని పోలీసులకు జగన్ సూచించారు. గతంలో పోలీసు శాఖపైనే తనదైన శైలిలో సంచలన ఆరోపణలు చేసిన జగన్… రెంటపాళ్లలో మాత్రం పోలీసు శాఖలో కొందరు మాత్రమే టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎల్లకాలం చంద్రబాబే అధికారంలో ఉండరన్న జగన్… తాము అధికారంలోకి వచ్చినంతనే చంద్రబాబుతో పాటు ఆయన చర్యలకు వత్తాసు పలికిన పోలీసులను కూడా బోను ఎక్కిస్తామని జగన్ హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates