వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం చేపట్టిన రెంటపాళ్ల పర్యటనను చూస్తుంటే.. నిజంగానే ఆయన చనిపోయిన వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారా?.. లేదంటే పల్నాడు జిల్లాలో తన బలం ఎంతో చూపే దిశగా బల ప్రదర్శన యాత్ర చేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగక మానవు. ఎందుకంటే… ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్.. ఉదయం 11 గంటలకు రెంటపాళ్ల చేరుకుని నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించి వెనుదిరాల్సి ఉంది. ఈ షెడ్యూల్ ను వైసీపీనే విడుదల చేసింది.
అయితే తన పార్టీ విడుదల చేసిన టూర్ షెడ్యూల్ నే జగన్ పక్కనపెట్టేశారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు కూడా ఆయన రెంటపాళ్లనే చేరుకోలేదు. 3.30 గంటల ప్రాంతంలో జగన్ కాన్వాయ్ ఇంకా సత్తెనపల్లిలోనే అశేష జనవాహిని మధ్య మెల్లగా కదులుతూ వెళుతోంది. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల చేరుకోవడానికి జగన్ కు ఇంకా గంటన్నరకు పైగా సమయం పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ, బాధిత కుటుంబానికి పరామర్శ, ఆ తర్వాత అక్కడే మీడియాతో జగన్ మాట్లాడటం…ఇవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఈ తరహా పరిస్థితులను ఊహించిన కారణంగానే పల్నాడు జిల్లా పోలీసులు తొలుత రెంటపాళ్లలో జగన్ పర్యటనకు అసలు అనుమతే ఇవ్వలేదు. మళ్లీ వైసీపీ నుంచి వినతి రావడంతో షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. జగన్ ఎస్కార్ట్ వాహనాలకు అదనంగా మరో మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే రెంటపాళ్లకు అనుమతిస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ విస్పష్ట ప్రకటన చేశారు. అంతేకాకుండా స్థానికులు కాని వారు అటు సత్తెనపల్లి గానీ, ఇటు రెంటపాళ్ల గానీ రావద్దని కూడా జిల్లా పోలీసులు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని కూడా వారు కోరారు.
అయితే పోలీసుల ఆంక్షలను వైసీపీలో జగన్ నుంచి కింది స్థాయి కార్యకర్త దాకా ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలే కనిపించలేదు. ఈ క్రమంలోనే ఓ వృద్ధుడు జగన్ కాన్వాయ్ తాకి మృతి చెందాడు. ఇక సత్తెనపల్లికి జగన్ కాన్వాయ్ చేరుకున్న సమయంలో పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వైసీపీకి చెందిన ఓ కార్యకర్త సొమ్మసిల్లిపడిపోయాడు. ఆయనను ఆసుపత్రి తరలించేలోగానే మరణించారు. ఇక జగన్ రెంటపాళ్ల చేరుకునే సరికి ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయోనన్న ఆందోళన నెలకొంది. మొత్తంగా జగన్ పరామర్శకు వెళుతున్నానని పర్మిషన్ తీసుకుని బల ప్రదర్శనకు దిగి తన పార్టీ కార్యకర్తల ప్రాణాలనే బలి తీసుకుంటున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates