నాలుగు చక్రాల వాహనాలతో జాతీయ రహదారులు ఎక్కితే…టోల్ మోత మోగిపోతుండటం అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. ఏం చేద్దాం..దేశ నిర్మాణంలో రహదారుల పాత్ర కీలకమైనది. క్షేమకరమైన, సత్వర ప్రయాణాల కోసం నిగనిగలాడే రహదారులు అవసరమే కదా. మరి వాటిని నిర్మించాలంటే ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సిందే కదా. ఇక బాధ్యత కలిగిన పౌరులుగా అందులో మనం భాగస్వామ్యం పంచుకోవాల్సిందే కదా. అందుకే జాతీయ రహదారులపై ఎంతదూరం ప్రయాణిస్తే అంత మేర టోల్ చెల్లించక తప్పడం లేదు.
ఈ టోల్ జర్నీలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం ఇదివరకే ఫాస్టాగ్ పేరిట ఆటోమేటిక్ టోల్ చెల్లింపు విధానం అమలులోకి వచ్చింది. తాజాగా ఈ టోల్ చెల్లింపుల విషయంలో కేంద్రం ఓ బంపర్ ఆపర్ ను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. అదేదో ముందుగా కొంత సొమ్ము చెల్లిస్తే.. కొంతకాలం వరకు ఫ్రీ జర్నీ అంటూ కొన్ని సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి కదా. గడ్కరీ కూడా ఆ తరహా ప్లాన్ నే ఈ ప్రకటనలో ప్రస్తావించారు.
ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న ఈ నూతన పథకం కింద ఆయా వాహనదారులు రూ.3 వేలు ఒకే సారి చెల్లిస్తే… ఈ చెల్లింపు జరిగినప్పటి నుంచి ఏకంగా 200 ట్రిప్పుల వరకు టోల్ చెల్లించకుండానే ప్రయాణించవచ్చు. ఇది ఈ చెల్లింపు జరిగిన నాటి నుంచి ఏడాది వరకు వర్తిస్తుంది. అంతేకాకుండా దేశంలోని ఏ జాతీయ రహదారి మీద అయినా ప్రయాణించే వీలుంటుంది. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా, ఏ జాతీయ రహదారి మీద అయినా ఈ పథకం వర్తిస్తుందని గడ్కరీ విస్పష్టంగా ప్రకటించారు. అయితే ఈ పథకాన్ని వాణిజ్యేతర వాహనాలు అంటే…కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తింపజేస్తున్నట్లు ఆయన పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉంటే… గడ్కరీ ప్రకటించిన ఈ డిస్కౌంట్ తరహా స్కీంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిత్యం తమ వాహనాలతో జాతీయ రహదారులు ఎక్కే వారికి ఈ పథకం మంచిగానే ఉంటుంది. 200 ట్రిప్పుల మేర టోల్ ఫ్రీ అంటే… దాదాపు ఆయా వాహనదారులకు రూ.4 వేల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పథకం ద్వారా రూ.3 వేలతోనే ఈ ట్రిప్పులు తిరిగేయొచ్చు. ఇక తరచూ నేషనల్ హైవేలను ఎక్కే వారికి మాత్రం ఈ పథకం అంతగా ఉపయోగపడన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates