సీఎం రేవంత్ ను పొగిడిన బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రథ సారధి ఎనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ఒకింత నెమ్మదిగా అయినా… పక్కాగా అమలు చేస్తూ సాగుతున్న రేవంత్ సర్కారు ప్రజల మన్ననలను చూరగొంటోంది. తాజాగా విపక్షం బీజేపీకి చెందిన కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రేవంత్ ను ఆకాశానికెత్తేశారు. దేశంలోనే రేవంత్ రెండో అత్యుత్తమ ముఖ్యమంత్రి అంటూ రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో గోశాలలను ఏర్పాటు చేయాలని ఇటీవలే రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోవులను సంరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా రేవంత్ ప్రకటించారు. గోశాలల ఏర్పాటుకు సంబందించి విధి విధానాలు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న విషయాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయన అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రేవంత్ చర్యలను ఆకాశానికెత్తేస్తూ రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో గోశాలలు ఏర్పాటు చేయాలన్న రేవంత్ నిర్ణయం గొప్పదని రాజా సింగ్ అన్నారు. గో రక్షణ కోసం రాష్ట్రంలో ఓ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని, అందులో తనకూ సభ్యత్వం ఇవ్వాలని ఆయన కోరారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నిస్తే.. గుర్తుకు వచ్చే రెండో పేరు రేవంత్ దేనని ఆయన అన్నారు. ఈ విషయంలో తొలి పేరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దని ఆయన అన్నారు. ఈ తరహా చర్యల ద్వారా రేవంత్ కు దేశంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. తెలంగాణలో గోవథను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.