‘వృద్ధి’లో ఏపీ ప‌రుగులు.. ఎలాగో చెప్పిన సీఎం చంద్ర‌బాబు

త‌ల‌స‌రి వృద్ధి.. దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్దిని సూచిస్తుంది. ఈ విష‌యంలోనే రాష్ట్రాలు కూడా పోటీ ప‌డ‌తాయి. తాజాగా కేంద్ర త‌ల‌స‌రి వృద్ధితో పోల్చుకుంటే.. ఏపీ జోరుగా ముందుకుసాగుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఇది ఎలా సాధ్య‌మైందో కూడా ఆయ‌న గ‌ణాంకాల రూపంలో వివ‌రించారు. తాజాగా అమ‌రావ‌తిలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌ణాళిక శాఖ‌పై స‌మీక్షించారు. ప్ర‌స్తుతం.. ఏపీ త‌ల‌స‌రి వృద్ధి 11.89 శాతంగా న‌మోదైన‌ట్టు తెలిపారు. అదే దేశీయంగా చూసుకుంటే జాతీయ స్థాయిలో వృద్ధి 8.7 శాతంగా ఉంద‌న్నారు. అంటే.. కేవ‌లం ఏడాది కాలంలోనే 3 శాతానికి పైగా వృద్ధి చెందామ‌ని వివ‌రించారు.

దీనిని నిల‌బెట్టుకోవ‌డంతోపాటు.. 15 శాతం వృద్ధి ల‌క్ష్యంగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. దీనికి సంబందించి ఎలాంటి కార్యాచ‌ర‌ణ ప్రారంభించాలి? అనుస‌రించాలి? అనే విష‌యాల‌పై క‌స‌ర‌త్తు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర‌ ఎకానమీ, గ్రోత్‌ డ్రైవర్స్‌(వృద్ధి ప్రాధాన్యాలు), జీఎస్‌డీపీ ప్రొజెక్షన్స్‌, కీ పెర్ఫామెన్స్‌ ఇండికేటర్లపై త‌గు సూచ‌న‌లు చేశారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆశించిన మేర‌కు వృద్ధి న‌మోదైంద‌ని చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు, పెట్టుబ‌డుల రాక‌, ప్ర‌జ‌ల జీవ‌న స్థితిగ‌తుల్లో చోటు చేసుకున్న మార్పులు వంటివి దీనికి దోహద ప‌డ్డాయ‌ని వివ‌రించారు.

ముఖ్యంగా సేవా రంగం వృద్ధి చెంది.. ఆదాయం పెరిగింద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. దీంతో పాటు.. మ‌రింత‌గా ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయం పెంపుతోపాటు.. ఇత‌ర రంగాల్లోనూ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే మార్గాల‌ను అన్వేషించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆతిథ్య‌, సేవల రంగం అభివృద్ధి జరిగితే.. ఆటోమేటిక్‌గా వృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. గ్రామస్థాయిలో కూడా కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లు పెడితే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ న‌గ‌రాల్లో ప్లాస్టిక్ పై నిషేధం..

రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ద‌శ‌ల వారీగా నిషేధించాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. ఒక‌సారి వాడి ప‌డేసేప్లాస్టిక్ కార‌ణంగా ప‌ర్యావ‌ర‌ణం క‌లుషితం అవుతోంద‌ని, భూగ‌ర్భ జ‌లాల వృద్ధిలోనూ కోత ప‌డుతోంద‌నిచెప్పారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానంగా విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, క‌ర్నూలు, రాజ‌మండ్రి, గుంటూరు వంటి ప్ర‌ధాన వాణిజ్య న‌గ‌రాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాల‌ని.. అధికారుల‌ను ఆదేశించారు. త‌క్ష‌ణ‌మే వీటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఆయా మునిసిపాలిటీల క‌మిష‌న‌ర్లు వీటిపై ప్ర‌త్యేక డ్రైవ్ చేయాల‌ని సూచించారు. అక్టోబ‌రు 2 నుంచి పూర్తిగా దీనిని అమ‌లు చేయాల‌న్నారు.