వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థుల బెదిరింపులు, దౌర్జన్యంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్న గ్రామ మాజీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఆ గ్రామానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా జగన్ గత పర్యటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు తొలుత జగన్ టూర్ కు అనుమతించలేదు. ఆ తర్వాత వంద మందితో జగన్ గ్రామంలో పర్యటనకు అనుమతిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ తెలిపారు.
అయితే జగన్ బయటకు వస్తే జనం తండోపతండాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటిస్తే… ఆ పార్టీ శ్రేణులు మిర్చి టిక్కీలను తొక్కుకుంటూ వెళ్లి నాశనం చేశాయి. ఆ తర్వాత మొన్న పొదిలి పర్యటనలో భాగంగా జగన్ పొగాకు రైతుల పరామర్శకు వెళితే.. వైసీపీ శ్రేణులు పొగాకు బేళ్లపై డ్యాన్సులు చేస్తూ సాగాయి. అంతేకాకుండా తమకు అడ్డుగా వచ్చే వారు ఎవరైనా సరే తొక్కుకుంటూ వెళతామంటూ ప్లకార్డులు పట్టి మరీ సాగిన వైసీపీ శ్రేణులు జగన్ కు నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలపై దాడులకు దిగారు. ఈ ఘటనపై ఏకంగా కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇక తెనాలిలో జగన్ పర్యటన గురించి కూడా ప్రత్యేకంగానే చెప్పుకోవాలి.
ఇలా విపక్షంలోకి రాగానే పార్టీ శ్రేణులను రెచ్చగొడుతూ సాగుతున్న జగన్… ఆయా టూర్లలో అధికార పార్టీలతో పాటు పోలీసులపైనా పరుష పదజాలాన్ని వినియోగిస్తున్నారు. జగన్ అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతున్నాయని చెప్పక తప్పదు. మొన్నటి పొదిలి పర్యటనలో మహిళలపై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడులే నిదర్శనమని చెప్పాలి. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలుగా పల్నాడు జిల్లా ఎస్పీ తొలుత జగన్ టూర్ కు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత వైసీపీ వినతితో ఎస్కార్ట్ వాహనాలు కాకుండా మూడు వాహనాలు, 100 మందితో జగన్ వెళితే తమకు అభ్యంతరం లేదని అనుమతి ఇచ్చారు.
అయితే పోలీసుల నుంచి అనుమతి లభించకముందే.. వైసీపీకి చెందిన కీలక నేతలు వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. వీరిలో మాజీ మంత్రి విడదల రజినీ, మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇంచార్జీ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిలు… పోలీసుల అనుమతితో తమకు సంబంధం లేదని, పోలీసులు అనుమతించినా, అనుమతించకున్నా జగన్ బుధవారం రెంటపాళ్ల వస్తున్నారని ప్రకటించేశారు. అసలు జగన్ ను ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్న దిశగా వారు తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి జగన్ రెంటపాళ్ల పర్యటనలో రచ్చ తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates