చెవిరెడ్డి ఉబలాటం తీర్చేసిన సిట్!

మద్యం కుంభకోణంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం నా వద్ద పనిచేసిన, నా స్నేహితులపై ఒత్తిడి తీసుకుని వచ్చి తప్పుడు స్టేట్ మెంట్ల కోసం సిట్ యత్నిస్తోంది. నన్ను అరెస్టు చేయాలనుకుంటే… కేవలం సమాచారం ఇస్తే చాలు. నేనే సిట్ కార్యాలయానికి వస్తా. మీకు ఏమాత్రం శ్రమ అవసరం లేదు. అంటూ కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్న వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉబలాటాన్ని సిట్ బృందం మంగళవారం డబుల్ డోస్ మోడ్ లో తీర్చి పడేసింది.

చెవిరెడ్డి చెప్పినట్టుగానే ఆయన వద్ద పదేళ్ల పాటు గన్ మన్ గా పనిచేసిన మదన్ రెడ్డి మంగళవారం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. చెవిరెడ్డికి మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లుగా చెప్పాలని, తాము చెప్పినట్లుగా స్టేట్ మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు ఒత్తిడి తీసుకువచ్చారని, అందుకు తాను ససేమిరా అనడంతో తనపై దాడి చేశారని, ఇకపై తాను విచారణకు వెళ్లాల్సి వస్తే లాయర్ తోనే వెళ్లేలా తనకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే గుట్టు చప్పుడు కాకుండా దేశం వదిలి పారిపోయేందుకు చెవిరెడ్డి స్కెచ్ వేశారు.

అయితే ఇప్పటికే చెవిరెడ్డిపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేయగా.. వాటి ఆధారంగా బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి కొలంబో ఫ్లైట్ ఎక్కేందుకు యత్నించిన చెవిరెడ్డిని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సిట్ అదికారులకు సమాచారం చేరవేశారు. సాయంత్రం దాకా చెవిరెడ్డి ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులోనే ఉండగా… సాయంత్రానికి బెంగళూరు చేరుకున్న సిట్ అధికారులు… ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రే ఆయనను విజయవాడ తరలించే దిశగా సిట్ యత్నిస్తోంది. వెరసి అరెస్టు చేసేందుకు యత్నం అంటూ చెవిరెడ్డి చేస్తున్న ఆరోపణలను సిట్ నిజం చేసి చూపింది.

ఈ ఘటనకు ముందు సిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం కుంభకోణంలో ఇప్పటిదాకా 33 మంది నిందితులను చేర్చిన సిట్… తాజాగా చెవిరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సహా మొత్తం ఆరుగురిని కొత్తగా నిందితులుగా చేరుస్తూ ట్రయల్ కోర్టులో మెమోను దాఖలు చేసింది. పలితంగా చెవిరెడ్డి తన అరెస్టు గురించి సిట్ ను ప్రశ్నించడానికి వీల్లేని విధంగా సిట్ చర్యలు చేపట్టింది. పనిలో పనిగా మోహిత్ ను కూడా నిందితుడిగా చేర్చిన సిట్.. చెవిరెడ్డికి భారీ షాకే ఇచ్చిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడైన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి నగదు అందుకున్న చెవిరెడ్డి ఆ డబ్బును ఎన్నికల్లో పంపిణీ చేశారన్నది సిట్ ప్రధాన ఆరోపణ. మొత్తంగా చెవిరెడ్డి కోరుకున్నట్లుగానే ఆయనపై కేసు నమోదు అయిన రోజే…ఆయన సిట్ అదుపులోకి వెళ్లిపోవడం గమనార్హం.