బెంగ‌ళూరులో చెవిరెడ్డి అడ్డగింత‌?

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని బెంగ‌ళూరులో విమానాశ్ర‌య అధికారులు అడ్డుకున్నారు. ఆయ‌న‌ను తిరిగి ఏపీకి పంపించారు. ఈ విష‌యాన్ని అక్క‌డి పోలీసులు నిర్ధారించారు. బెంగ‌ళూరు నుంచి శ్రీలంక రాజ‌ధాని కొలంబో వెళ్లే విమానం ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్ స‌మ‌యంలో చెవిరెడ్డిని విమానాశ్ర‌య అధికారులు అడ్డుకున్నార‌ని చెప్పారు. ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో చెవిరెడ్డిపై కూడా.. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నా రు. ఈ క్ర‌మంలో కొన్నాళ్ల కింద‌టే.. ఆయ‌న‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశ‌వ్యాప్తంగా అన్ని విమానాశ్ర‌యాల‌కు ఈ నోటీసులు పంపించారు. ఈ క్ర‌మంలో చెవిరెడ్డిని బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో అధికారులు అడ్డుకున్నారు. ఆ వెంట‌నే ఏపీకి త‌ర‌లించారు. అయితే.. దీనిపై చెవిరెడ్డి ఎలాంటి కామెంట్ చేయ‌లేదు.

మ‌రోవైపు.. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి గ‌న్‌మెన్ మ‌ద‌న్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో విచారణ పేరుతో.. సిట్ అధికారులు త‌న‌పై దాడి చేశారని, తీవ్రంగా కొట్టార‌ని మదన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. తాము చెప్పిన‌ట్టే స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి చేశారన్న మదన్.. సిట్ అధికారుల తీరుపై హైకోర్టు ప‌ర్య‌వేక్షించాల‌ని కోరారు. త‌న విచారణకు న్యాయవాదిని అనుమతించాలని కోరిన మదన్… త‌న ప్రాణాల‌కు కూడా భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని విన్న‌వించారు.