వైసీపీ అధినేత జగన్.. బుధవారం గుంటూరు జిల్లా పల్నాడులో పర్యటించేందుకు రెడీ అయ్యారు. ఇక్కడి సత్తెనపల్లి నియోజకవర్గంలో నాగమల్లేశ్వరరావు అనే పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత.. జగన్ ఓటమిని తట్టుకోలేక.. సదరు నాగమల్లేశ్వరరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి జగన్ తమ ఫ్యామిలీని ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఎట్టకేలకు జగన్ ముందుకు వచ్చారు.
నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి సంబంధించి పల్నాడు ఎస్పీ అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వాలని వైసీపీ నాయకులు కోరారు. అయితే.. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటించినప్పుడు.. తీవ్ర అలజడి ఏర్పడింది. దీనిని కంట్రోల్ చేయలేక పోలీసులు ఇబ్బందులు పడ్డారు. ఇక, ఇప్పుడు కూడా.. అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు.
అయితే.. మధ్యే మార్గంగా 100 మందితో వస్తే.. ఓకే అని చెప్పారు.కానీ, వైసీపీ మాత్రం 30 వేల మంది వస్తారని.. అసలు జగన్ బయటకు వచ్చాక.. ఎంత మంది వస్తారో కూడా చెప్పలేమని పేర్కొంది. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని పక్కన పెట్టారు. మరోవైపు తమ నాయకుడు ప్రజల్లోకి వస్తే.. అనుమతి ఇవ్వడం లేదంటూ.. పోలీసులపై వైసీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ నాయకులు గతాన్ని గుర్తు చేస్తున్నారు.
యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్‌కు అనుమతులు ఇవ్వకుండా ఎలా అడ్డుకున్నారో చూడండి! అంటూ.. కొన్ని పాత వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు అప్పట్లో చేపట్టి కార్యక్రమాలకు సంబంధించి కూడా.. అనుమతులు ఇవ్వని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా ప్లే చేస్తున్నారు. సో.. ఇవన్నీ.. జగన్ మరిచిపోయారా? అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates