తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. తాజాగా జైలు-జైలు అంటూ పాట పాడిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ – రేస్ వ్యవహారంపై ఆయనను విచారణకు పిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను అరెస్టు చేసే అవకాశం ఉందని.. జైలుకు వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. అయితే.. ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేయలేదు. విచారణ అనంతరం బయటకు వదిలేశారు. అయితే.. ఆ తర్వాత కూడా కేటీఆర్ మరోసారి జైలు జీవితంపై మాట్లాడారు. తనను జైల్లో పెడితే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటానని అన్నారు.
ఇక, ఈ కామెంట్లపై మంత్రి సీతక్క కూడా స్పందించారు. కేటీఆర్‌కు జైలుకు వెళ్లాలని ఉబలాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. సింపతీ కోసం కేసీఆర్ ప్యామిలీ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోందని.. దీనిలో భాగంగానే కేటీఆర్ జైలు.. జైలు.. అం టూ పాటలు పాడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కవిత జైలుకు వెళ్లినా.. పార్టీకి సింపతీ రాలేదని గుర్తు చేశారు. అప్పట్లో కూడా కవిత అరెస్టును చూపించి ఎన్నికల్లో విజయందక్కించుకునేందుకు ప్రయత్నించారని.. కానీ, ప్రజలు ఈ నాటకాలను గమనించారని మంత్రి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు అంత మోజుగా ఉన్నా.. ప్రభుత్వానికి అలాంటి తీరిక లేదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ పని అని పేర్కొన్నారు.
ఇక, నెటిజన్లు కూడా కేటీఆర్ చేసిన జైలు వ్యాఖ్యలపై ఆసక్తిగా స్పందిస్తున్నారు. కేటీఆర్ జైలుకు వెళ్తే.. పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని ఒకరు వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను జైల్లో పేట్టే సాహసం సీఎం రేవంత్ రెడ్డి చేయబోరని ఒకరు వ్యాఖ్యానించారు. మరికొందరు జైలుకు వెళ్తే.. బీఆర్ఎస్‌ను నడిపించేవారు ఎవరు? అంటూ కామెంట్లు చేశారు. కవిత అప్పుడు పార్టీ పగ్గాలు తీసుకునే చాన్స్ ఉంటుందని కొందరు వ్యాఖ్యానించారు. నెటిజన్లు పలు రకాలుగా తమ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే.. తాజా విచారణలో ఏసీబీ కేటీఆర్‌ను 8 గంటలపాటు విచారించింది. అనంతరం ఆయనను వదిలేసింది.
కాగా.. తాజా విచారణలో కేటీఆర్‌ను గతంలో వాడిన మొబైల్ ఫోన్లను తమకు అప్పగించాలని అధికారులు ఆదేశించారు. దీనికి రెండు రోజుల సమయం ఇచ్చారు. తొలుత మీవెంట సెల్ ఫోన్ తీసుకువచ్చారా? అని అధికారులు ప్రశ్నించారు. తీసుకువస్తే.. తమకు అప్పగించాలని కోరారు. కారు డ్రైవర్ వద్ద ఉంచారా? అని కూడా ప్రశ్నించారు. అయితే.. తాను అసలు ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 18లోగా ఫోన్లను తమకు అప్పగించాలని అధికారులు ఆదేశించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates