జోగి ఇల్లు నేల మ‌ట్టం చేస్తాం: టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో ఎన్టీఆర్ జిల్లా రాజ‌కీయాలు వేడి వేడిగా ఉన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, ఆయ‌న సోద‌రుడు, మాజీ ఎంపీ కేశినేని నానీల మ‌ధ్య రాజ‌కీయ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ వ‌ర్సెస్ మైల‌వ‌రం ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు, వైసీపీ మాజీ నేత వసంత కృష్ణ ప్ర‌సాద్ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది.

స్థానిక కొండ‌ప‌ల్లి మునిసిపాలిటీని హైకోర్టు ఆదేశాల‌తో టీడీపీ కైవ‌సం చేసుకుంది. మునిసిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ .. ఇత‌ర అధికారిక ప‌ద‌వుల‌కు నాయ‌కుల‌ను నిర్దేశించింది. అయితే.. దీనిపై జోగి ర‌మేష్ తీవ్ర‌స్థాయిలో స్పందించారు. చంద్ర‌బాబు దుష్ట రాజ‌కీయాల‌కు ఇది నిద‌ర్శ‌మ‌ని.. కుటిల యుక్తుల‌తో వ్య‌వహ‌రించి.. కొండ‌ప‌ల్లి మునిసిపాలిటీని టీడీపీ ద‌క్కించుకుంద‌ని జోగి విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. జోగి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ తీవ్రంగా స్పందించారు.

ఈ క్ర‌మంలో జోగి రమేష్ పై వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్ర‌బాబు అంటే త‌మ‌కు ఎంతో గౌర‌వం ఉంద‌ని.. ఆయ‌న చేసిన సూచనల మేరకు టిడిపి క్యాడర్ స‌హా తామంతా ఎంతో సంయ‌మ‌నంతో ఉంటున్నామ‌ని చెప్పారు. అందుకే.. జోగి లాంటి వారు నోరుపారేసుకుంటున్నా.. తాము మౌనంగా ఉంటున్న‌ట్టు తెలిపారు. కుటిల య‌త్నాలు చేసింది వైసీపీనేన‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో క‌నీసం టీడీపీ వారిని నామినేష‌న్ కూడా వేయ‌కుండా అడ్డుకున్నార‌ని చెప్పుకొచ్చారు.

అలాంటి వారు ఇప్పుడు చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తారా? అంటూ.. వ‌సంత ఊగిపోయారు. మరోసారి చంద్రబాబు జోలికి వస్తే జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. “నేనే స్వ‌యంగా ద‌గ్గ రుండి జోగి ఇల్లు కూల్చేయిస్తా. బుల్ డోజ‌ర్ల‌తో రెప్ప‌పాటులో ఆయ‌న ఇంటిని నాశ‌నం చేస్తా” అని వ‌సంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.