ఏపీకి కష్టమొస్తే కేంద్రమే నడిచొస్తోంది!

నిజమే… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కూడా ఏపీకి ఏ చిన్న సమస్య వచ్చినా… దానిని పరిష్కరించేందుకు కేంద్రం ఆఘమేఘాల మీద చర్యలు తీసుకుంటోంది. సమస్య కాస్త పెద్దది అయితే ఏకంగా ఏపీకి వస్తున్న కేంద్రం దానిని పరిష్కరించే దిశగా కృష్టి చేస్తోంది. ఇదేదో అదాటుగా చెబుతున్న మాట కాదు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏపీ పర్యటనకు వచ్చారు. పొగాకు రైతుల సమస్య, వాణిజ్య పంటల ఎగుమతులు, ఇతర పంటలకు మద్దతు ధరలపై ఆయన కీలకంగా దృష్టి సారించనున్నారు.

ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే… టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వస్తే… ఎన్డీఏ సర్కారు మరు నిమిషమే కుప్పకూలడం ఖాయం. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యదిక ఎంపీ సీట్లున్న పార్టీగా టీడీపీ కొనసాగుతోంది. అంతేకాకుండా టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ ధురంధురలను పక్కనపెట్టి ముందుకు సాగడం మోదీకి సుతరామూ ఇష్టం లేదు. మొత్తంగా కేంద్రంలో ఏపీ వెయిట్ ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయింది.

ప్రస్తుతం ఏపీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేకున్నా… ఆయా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తీర్చలేనంతగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోక తప్పడం లేదు. ఇటీవలే మిర్చి ధరల పతనం సమస్య రాగా… కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ దానిని పరిష్కరించారు. తాజాగా ఏపీలో పొగాకు ధరల పతనం కూడా రైతులను తీవ్రంగా ఆవేదనకు గురి చేస్తోంది. దీనిపై విపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రమే ఈ విషయాన్ని తెలుసుకుని మరీ వాణిజ్య శాఖ మంత్రి నేరుగా ఏపీకే వచ్చేశారు.

ఆదివారం అమరావతి చేరుకున్న పీయూష్ గోయల్… ఏపీ సీఎం చంద్రబాబుతో లంచ్ భేటీలో పాలుపంచుకున్నారు. ఈ సందర్బంగా పొగాకుకు మద్దతు ధరతో పాటుగా వాణిజ్య పంటల ఎగుమతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర పంట ఉత్పత్తులకు అరకొరగా దక్కుతున్న మద్దతు దరలను చంద్రబాబు ప్రస్తావించారు. వీటన్నింటినీ సావదానంగా విన్న గోయల్… లంచ్ భేటీ తర్వాత నేరుగా గుంటూరులోని పొగాకు బోర్డుకు వెళ్లారు. అక్కడ ఆయన పొగాకు బోర్డు అదికారులతో పాటుగా స్టేక్ హోల్డర్స్ తోనూ కీలక చర్చలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇతరత్రా సమస్యలపైనా ఆయన పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడతారని సమాచారం.