15 రోజుల గ‌డువు.. `కాంగ్రెస్` రెడీ అయ్యేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పైగా ప్ర‌భుత్వానికి ఏడాదిన్న‌ర కూడా దాటిపోయింది. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు శ్రీకారం చుడుతున్న‌ట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చెప్పేశారు. ఈ నెల ఆఖ‌రు నాటికి నోటిఫికేష‌న్ ఇచ్చేసేలా ప్ర‌భుత్వం నుంచి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అంతేకాదు.. ఆయ‌నే స్వ‌యంగా ఈ క్ర‌తువుకు 15 రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంద‌ని వెల్ల‌డించారు. ఈ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పార్టీ పుంజుకుని.. స్థానిక సంస్థ‌ల‌ను కైవ‌సం చేసుకోవాల‌ని కూడా చెప్పుకొచ్చారు.

అయితే.. చెప్పినంత ఈజీగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప‌రిస్థితి ఉండే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. బీ-రెడీ అన్నంత తేలిక‌గా.. నాయ‌కులు క‌లిసి క‌ట్టుగా ఎన్నిక‌ల‌కు రెడీ అయ్యే ప‌రిస్థితి కూడా లేదు. ఈ నేప‌థ్యంలో అస‌లు స్థానిక సంస్థ‌ల్లో ఏం జ‌రుగుతోంది?  నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎలా ఉన్నారు? వారు స‌ర్కారుపై సానుకూలంగానే ఉన్నారా? అనేది కీల‌క అంశం. ఈ విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. లేర‌న్న స‌మాధానం అంద‌రికీ తెలిసిందే.

స్థానిక సంస్థ‌లు అంటే.. ప్ర‌త్యేకంగా ఎక్క‌డో ఉండ‌వు. అసెంబ్లీ, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనే ఉంటాయి. ఈ నేప‌థ్యంలో ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు పూనిక వ‌హిస్తేనే.. స్థానికంగా నాయ‌కులు జెండా ప‌ట్టుకుంటారు.. జైజై అంటూ స్థానికంగా తిరుగుతారు. దీనికి కూడా ఖ‌ర్చులు మోసేవారు ఉండాలి. ఇప్పుడున్న ప‌రిస్థితిలో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి పార్టీ ప‌రంగా ఉన్న సంతృప్తి ఖ‌చ్చితంగా 50 శాతం లోపే అంటున్నారు ప‌రిశీల‌కులు.

రైతు రుణ మాఫీ విష‌యంలో గ్రామీణ తెలంగాణ అసంతృప్తి సెగ‌లు కక్కుతోంది. 55 వేల ఉద్యోగాల‌ను ఇచ్చామ‌ని చెబుతున్నా.. మ‌రో నాలుగు రెట్ల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అదేస‌మయంలో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు సంబంధించిన ల‌బ్ధిదారుల్లో కోత భారీ స్థాయిలో క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సెగ‌లు పుట్టించే అవ‌కాశం ఉంది.

పైగా.. రేవంత్ రెడ్డిపై సొంత పార్టీలోనే కొంద‌రు ఎగ‌స్పార్టీ జెండా ఎగుర‌వేస్తున్నారు. మంత్రి వ‌ర్గ ముచ్చ‌ట ఇంకా చ‌ల్లార‌లేదు. వీటిని ప‌రిగ‌ణ‌న‌లో కి తీసుకుంటే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఈ 15 రోజుల్లో ఏమేర‌కు వాటిని సాధించ‌గ‌ల‌దు? ఏమేర‌కు సంతృప్తిని పెంచ‌గ‌ల‌దు.. అనే ఈ రెండు కీల‌క విష‌యాల‌పైనే ఆధార‌ప‌డి ఎన్నిక‌లు ఉంటాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.