తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు.. ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీకి ముహూర్తం నిర్ణయించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులు, దిగ్గజ రచయితలు కూడాసీఎం చంద్రబాబును కలుసుకోనున్నారు.
ఈ భేటీకి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా రానున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దగ్గుబాటి సురేష్, కె. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ సహా.. సీనియర్ దర్శకులు, నిర్మాతలు.. అశ్వినీదత్ వంటి వారు కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, తాజా పరిణామాలపై వారంతా ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. కాగా.. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… సినీ ఇండస్ట్రీపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
లేఖతో..
తెలుగు సినీ ఇండస్ట్రీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత నెలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి ఏమాత్రం కృతజ్ఞత లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 మాసాలు అయినా.. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబును కలుసుకునేందుకు ఒక్కరు కూడా రాలేదు. కనీసం అభినందించనూ లేదు. ఇకపై నన్ను ఎవరూ వ్యక్తిగతంగా కలుసుకోవద్దు! అని పవన్ కల్యాణ్ లేఖ సంధించారు. కూటమి ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న సీఎం చంద్రబాబును కనీసం మర్యాద పూర్వకంగా అయినా.. సినీ ఇండస్ట్రీ పెద్దలు పలకరించారా? అని నిలదీశారు.
ఇదేసమయంలో వైసీపీ హయాంలో పరిశ్రమలోని కొందరిని ఎలా వేధించారో.. పవన్ గుర్తు చేశారు. హీరోలను విలన్‌ల మాదిరిగా ట్రీట్ చేశారని వ్యాఖ్యానించారు. అనంతరం.. సినీ ఇండస్ట్రీలో పెను కుదుపు ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముఖ్యమంత్రితో భేటీ కి ఇండస్ట్రీ పెద్దలు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates