ఇది మ్యాంగో వార్!… ఏపీ వర్సెస్ కర్ణాటక!

వినడానికి వింతగా ఉన్నా… దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకల మధ్య ఇప్పుడు మ్యాంగో వార్ మొదలైపోయింది. ఈ యుద్ధానికి ఈ రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కూడా కారణం కాకున్నా… థరల తరుగుదలే ప్రధాన కారణంగా నిలుస్తోందని చెప్పక తప్పదు. ఏటా మామిడి సీజన్ వచ్చిందంటే… మంచి ధరలతో రైతులు సంతోషంగా తమ పంటలను విక్రయించుకునే వారు. వ్యాపారులు కూడా రైతుల వద్ద డిమాండ్ కంటే కూడా అధికంగా మామిడిని కొనుగోలు చేసుకుని విక్రయించుకుని లాభాలు ఆర్జించేవారు. మొత్తంగా వ్యవహారం అంతా సాఫీగా సాగేది. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. థరలు అమాంతంగా పడిపోవడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది.

మన దేశంలో చాలా రాష్ట్రాల్లో మామిడి సాగు అవుతోంది. అత్యధికంగా మామిడి సాగు అవుతున్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ తొలి స్థానంలో నిలుస్తుండగా… ఏపీ రెండో స్థానంలో, కర్ణాటక మూడో స్థానంలో నిలుస్తున్నాయి. కర్ణాటకలో మామిడి ఈ మేర సాగు అవుతున్నా…అక్కడి మామిడిలో మెజారిటీ మామిడి ప్రత్యేకించి తోతాపురి ఏపీకే తరలి వెళుతోంది. ఏపీలోని చిత్తూరు జిల్లా పరిధిలోని పల్ప్ పరిశ్రమలే ఈ మామిడికి ఆధారం. అయితే ఇప్పుడు ఏపీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం కర్ణాటక నుంచి తోతాపురి మామిడి దిగుమతిని నిలిపివేసింది. ఈ పరిణామం కర్ణాటక రైతులను షాక్ కు గురి చేసింది. అయితే ఇదేదో తాత్కాలిక నిలిపివేత అని భావించిన కన్నడ రైతులు.. ఆ తర్వాత ఏపీ ఎంతకీ మామిడి దిగుమతులను అనుమతించకపోవడంతో తాజాగా ఆందోళనకు దిగారు. 

ఈ పరిస్థితి మరింత దిగజారిపోకుండా ఉండేలా…కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. కర్ణాటక తోతాపురి మామిడి దిగుమతులపై అమలు చేస్తున్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఆయన సదరు లేఖలో బాబును కోరారు. లేనిపక్షంలో రైతుల నుంచి తమకు తీవ్ర నిరసనలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని కూడా ఆయన ఆభ్యర్థించారు. తమ రైతుల ప్రయోజనాల దృష్ట్యా తాము కూడా ప్రతీకార చర్యలకు దిగాల్సి వస్తుందని కూడా ఆ లేఖలోఆయన హెచ్చరించారు. సిద్దరామయ్య లేఖపై ఎలా స్పందించాలో కూడా ప్రస్తుతానికి బాబుకు అర్థం కావడం లేదన్న మాట ఏపీ అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. పొరుగు రాష్ట్ర రైతులకు వచ్చిన కష్టాన్ని తీర్చాలంటే తమ రైతుల గొంతు కోయాల్సి వస్తోందని, ఇదెలా సాధ్యపడుతుందని కూడా ఆ వర్గాలు వాపోతున్నాయి.

ధరల తరుగుదలతో ఏపీలోని రైతుల వద్దే తోతాపురి మామిడి నిలిచిపోయింది. వ్యాపారులు మరీ తక్కువ ధరలు ఆఫర్ చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పడిపోయారు. అయితే మరీ ఎక్కువ కాలం మామిడిని తమ వద్దే ఉంచుకోవడానికి కూడా వీలు కాదు కదా. మరేం చేయాలి? ఇదే విషయాన్ని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా… మన రైతుల తోతాపురి మామిడి అమ్ముడయ్యేదాకా కర్ణాటక నుంచి తోతాపురి కొనుగోలును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో వ్యాపారులతో మాట్లాడి రైతులు, వ్యాపారులకు మధ్యేమార్గంగా ఓ ధరను నిర్ణయించారు. ఫలితంగా ఇప్పుడిప్పుడే ఏపీ రైతుల తోతాపురం మామిడి అమ్మకాలు మొదలయ్యాయి. మరి ఏపీలో మామిడి దిగుబడులను పెట్టుకుని… కర్ణాటక నుంచి మామిడిని కొనుగోలు చేయలేరు కదా. మరి ఈ మ్యాంగో వార్ ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.