ఏపీలో ఇప్పుడు పెను కలకలమే రేపిన సాక్షి చర్చా కార్యక్రమంలో పాలుపంచుకోవడంతో పాటుగా అమరావతిని వేశ్యల రాజధాని అంటూ జుగుత్సాకర వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పరిధిలోని లోటస్ లో నివసించే కృష్ణంరాజు తనపై కేసు నమోదు కాగానే ఇల్లు వదిలి పారిపోయారు. నేరుగా విశాఖకు వెళ్లి అక్కడ ఆయన తలదాచుకున్నారు.
ఈ కేసులో సాక్షి ఇన్ పుట్ ఎడిటర్, డీటేబ్ హోస్ట్ గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో ఆయనను రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత అసలు నిందితుడు కృష్ణంరాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన విశాఖలో ఉన్నట్లు గమనించారు. ఆ వెంటనే విశాఖ వెళ్లిన తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం కృష్ణంరాజును పోలీసులు విశాఖ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గురువారం ఉదయానికంతా విజయవాడ చేరుకోనున్న పోలీసులు… తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కృష్ణంరాజును విచారించనున్నారు. ఆ తర్వాత గురువారమే ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొమ్మినేనికి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో కృష్ణంరాజుకు కూడా జైలు తప్పదన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో కొమ్మినేని సహా కృష్ణంరాజుకు కూడా ఇప్పుడప్పుడే బెయిల్ లభించే అవకాశాలూ లేవన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates