నిమ్మల ర్యాగింగ్ ను వైసీపీ తట్టుకోగలదా..?

మొన్నటిదాకా ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ చిన్న వేడుక జరిగినా… నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు… అంటూ డప్పులు కొడుతూ, టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఓ రేంజిలో అడుకున్నారు. సరే… ఏం చేద్దాం? రాజకీయాలు అన్నాక.. ఓ సారి మాట పడాల్సి వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు చిరుతలా లంఘించాలి. మొన్నటిదాకా ఈ విషయంలో బాల్ వైసీపీ కోర్టులో ఉంటే… ఇప్పుడు అది నిమ్మల కోర్టులోకి వచ్చి పడింది. మరి వైసీపీ మాదిరిగా నిమ్మల కూడా ఇప్పుడు ర్యాగింగ్ మొదలుపెడితే… అసలు ఘోర పరాజయంతో బిక్క చచ్చిన వైసీపీ ఆ ర్యాగింగ్ ను తట్టుకుంటుందా? అన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార వైసీపీని ఎలాగైనా గద్దె దించాల్సిందేనన్న కసితో టీడీపీ.. జనసేన, బీజేపీలతో జట్టు కట్టి కూటమిగా ఏర్పడింది. ఈ కూటమి బాగా ఆలోచించి… సూపర్ సిక్స్ పేరిట ఏపీ ప్రజలకు వరాల జల్లు కురిపించింది. అందులో మహిళలకు ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500…వంటి పథకాలను ఇందులో ప్రకటించింది. ఈ హామీలను కూటమి పార్టీల నేతలు జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో సఫలం అయ్యరనే చెప్పాలి. అందులో నిమ్మల మరింతగా కష్టపడ్డారు. ఎక్కడికెళ్లినా… నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ ఆయన లయబద్ధంగా చేసిన ప్రచారం నిజంగానే ఆకట్టుకుంది.

అంతా అనుకున్నట్టుగానే కూటమి పార్టీలకు అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఏపీ ప్రజలు.. వైసీపీకి ఘోర పరాభవాన్ని మిగిల్చారు. రాజకీయం అన్నాక గెలుపు ఓటములు సహజమే కదా. జగన్ కూడా అదే మాట చెబుతూ అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఆయా సందర్భాలను ఆసరా చేసుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సాగారు. నిమ్మల చేసిన ప్రచారాన్ని ఒకానొక సమయంలో జగన్ కూడా అనుకరించి మరీ అపహాస్యం చేశారు. ఇక వైసీపీ శ్రేణులు అయితే ఎక్కడికక్కడ నిమ్మలను అవహేళన చేస్తూ… తల్లికి వందనం ఎప్పుడూ అంటూ నిలదీయం, మొదలుపెట్టారు. పథకం ఇంకా పట్టాలెక్కలేదు కాబట్టి…ఈ ర్యాగింగ్ ను నిమ్మల కూడా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.

ఆర్థిక పరంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ… తల్లికి వందనం పథకాన్ని కూటమి సర్కారు గురువారం ప్రారంభిస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.8,745 కోట్ల నిధులతో మొత్తం విద్యనభ్యసిస్తున్న పిల్లలందరూ 67,27,164 మందికి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో గురువారం రూ.15 వేల చొప్పున నిధులు వేయనుంది. జగన్ జమానాలో ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా… ఒక్కరికి మాత్రమే అమ్మ ఒడిని అందించారు. అయితే అందుకు విరుద్ధంగా కూటమి సర్కారు హామీ ఇచ్చినట్లుగానే ఇంటిలో ఎంతమంది పిల్లలకు అర్హత ఉంటే… అంతమందికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. అంతేకాకుండా 1వ తరగతిలోకి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోకి జాయిన్ అయ్యే పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. మరి ఈ పథకం అమలు అయ్యాక నిమ్మల ర్యాగింగ్ కు దిగితే… వైసీపీ నేతలు, ప్రత్యేకించి జగన్ తన ముఖం ఎక్కడ పెట్టుకుంటారోనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.