యూపీఐ చెల్లింపులపై బాదుడు?…కేంద్రం క్లారిటీ ఇదే!

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే.. ఇలా లెక్కలేనన్ని యూపీఐ యాప్ లు అందుబాటులోకి రావడంతో భారత్ లో మెజారిటీ జనం నగదుగా డబ్బు చెల్లించడం దాదాపుగా మానేశారు. ఈ పేమెంట్ యాప్ లలో దేనినో ఒకదాని ద్వారా వారు తమ చెల్లింపులు చేస్తున్నారు. ఈ తరహా పేమెంట్లలో భారత్ దూసుకుపోతోందని చెప్పక తప్పదు. కొందరైతే దాదాపుగా అన్ని యాప్ లను కూడా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ తరహా యూపీఐ పేమెంట్లపై చార్జీలు వేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై గతంలో ఓ దఫా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

తాజాగా గత రెండు, మూడు రోజులుగా ఇదే తరహా ప్రచారం మరోమారు ఊపందుకుంది. బుధవారం అయితే ప్రదాన  మీడియా సంస్థలన్నీ యూపీఐ చెల్లింపులపై బాదుడు తప్పదని ఏకంగా గణాంకాలతో సహా ఊదరగొట్టేశాయి. తెలుగు టాప్ న్యూస్ ఛానెళ్లు అయితే ఏకంగా స్టోరీల మీద స్టోరీలు ప్రసారం చేశాయి. వినియోగదారుల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు కాకపోవడంతో తాము బాగా నష్టపోతున్నామని యూపీఐ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయని, తప్పని సరిగా చార్జీలు మోపాల్సందేనంటూ ప్రతిపాదించాయని ఆయా మీడియా సంస్థలు తెలిపాయి.

ఈ ప్రచారంపై కాస్తంత ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు మోపే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ క్లియర్ ప్రకటనను విడుదల చేసింది. యూపీఐ చెల్లింపుల్లో రూ.3 వేలు దాటితే కొంత మొత్తం మేర చార్జీ లని కొన్ని సంస్తలు, రూ.2 వేలు దాటితే కొంత చార్జీ అని మరికొన్ని సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తప్పుడు వార్తలను, ప్రకటనలను ఎవరూ నమ్మవద్దంటూ కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మరి కేంద్రం నుంచి ఇంతటి క్లారిటీ వచ్చిన తర్వాత అయినా ఈ వదంతులకు చెక్ పడుతుందో, లేదో చూడాలి.