వైసీపీ అధినేత జగన్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆయన బుధవారం పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను పరామర్శించేందుకు వచ్చారు. అయితే.. రాజధాని అమరావతి పై సాక్షి టీవీలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లపై మహిళలు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. గత నాలుగు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
సాక్షి టీవీలో చేసిన వ్యాఖ్యలకు వైసీపీ అధినేతగా, సాక్షి టీవీ యజమానిగా జగన్ సమాధానం చెప్పాలని, మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని.. మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. జగన్ కానీ, భారతి కానీ.. ఎక్కడా స్పందించలేదు. అసలు పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పొదిలి పర్యటనకు వచ్చిన జగన్‌కు మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్త మైంది.ఆయన పర్యటిస్తున్న సమయంలో మహిళలు నల్ల బెలూన్లను గాలిలోకి ఎగురవేసి నిరసన తెలిపారు.
అదేవిధంగా ప్లకార్డులు చేతిలో పట్టుకుని ఆందోళన నిర్వహించారు. “జగన్ గో బ్యాక్” నినాదాలతో హోరె త్తించారు. ‘జగన్ క్షమాపనలు చెప్పాల్సిందే’ అని రాసి ఉన్న బోర్డులు కూడా కనిపించాయి. అయితే.. వీరిని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఆగ్రహానికి గురైన మహిళలు చెప్పులు, రాళ్లు రువ్వారు. వీటిలో కొన్ని చెప్పులు జగన్ కాన్వాయ్‌పై పడ్డాయి. అయితే.. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
మరోవైపు.. వైసీపీ కార్యకర్తలు కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు రాయి తగిలి గాయమైంది. దీంతో జగన్ పర్యటించిన ప్రాంతం రణరంగంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీ చార్జి చేస్తారన్న భయంతో పలువురు యువతులు పరుగులు పెట్టారు.ఇన్ని ఉద్రిక్తతల మధ్య జగన్ పర్యటన సాగింది. చివరకు ఆయన రైతులను కలుసుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates