ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో అక్రమాలు చేసి.. జైలుకు కూడా వెళ్లిన కర్ణాటక వ్యాపార వేత్త., ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షపై హైకోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో ఆయనకు ఊరట లభించినట్టయింది. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 2009-10 మధ్య కర్ణాటక-అనంతపురం మధ్య ఉన్న ఓబులాపురం గనులను అనుమతికి మించి దోచుకున్నారన్న కేసులో గత మేలో సీబీఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి సహా.. ఆయన బావ.. ఐఆర్ ఎస్ అధికారి బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అలీఖాన్‌లకు ఏడేళ్లపాటు జైలు శిక్ష విధించింది.
దీంతో పోలీసులు.. చంచల గూడ జైలుకు తరలించారు. అయితే.. ఇంతలోనే గాలి జనార్దన్ రెడ్డి సహా.. మిగిలిన వారు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జైలు జీవితం గడపలేక పోతున్నామని.. వయసు రీత్యా అయినా.. తమను కరుణించాలని వారు వేడుకున్నారు. ఈ పిటిషన్‌లో గాలి సహా .. మిగిలిన దోషులు పలు కీలక విషయాలతో కోర్టును అభ్యర్థించారు. వయసు, తమ వ్యాపారాలు, కుటుంబాలు సహా.. ఆరోగ్య అంశాలను ప్రస్తావించారు.
“వయసు రీత్యా వచ్చిన బీపీ, షుగర్‌తో ఇబ్బంది పడుతున్నాను. నాపై చేసిన అభియోగాలకు ఆధారాలు లేవు. గతంలో విచారించినప్పుడు కూడా.. ఎలాంటి ఆధారాలను ప్రవేశ పెట్టలేదు. అందుకే గతంలో బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చారు కదా.. అని నేనేమీ తప్పు చేయలేదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బెయిల్ మంజూరు చేయండి. ఎలాంటి నిబంధనలు విధించినా.. కట్టుబడి ఉంటాం“ అని గాలి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే.. గాలి, ఇతర దోషులకు బెయిల్ ఇవ్వరాదని.. వారు చేసిన నేరాలు రుజువయ్యాయని సీబీఐ తర ఫున న్యాయవాదులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తాజాగా శిక్షను నిలిపి వేస్తూ.. తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి కొన్ని షరతులు కూడా విధించింది. 2 లక్షల రూపాయల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అదేవిధంగా పాస్ పోర్టులను పోలీసులకు స్వాధీనం చేయాలని పేర్కొంది. ఎట్టి పరిస్థితిలోనూ దేశం విడిచి వెళ్లరాదని, షరతులను ఉల్లంఘించడానికి వీల్లేదని తెలిపింది.