జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్‌ను రెడ్ల‌కు అమ్మే కుట్ర‌: రాజా సింగ్

హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రెండు రోజుల కింద‌ట మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో మ‌రో ఆరు మాసాల్లో ఈ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. తాజాగా బీజేపీ నాయ‌కుడు, ఘోషా మ హ‌ల్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ ఈ వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉప ఎన్నిక‌కు ఇంకా ముహూర్తం ఖ‌రారు కాక‌ముందే.. ఈ టికెట్‌ను రెడ్ల‌కు అమ్ముకునేందుకు త‌న పార్టీ వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న రాజ‌కీయ బాంబు పేల్చారు. ప్ర‌త్య‌క్షంగా ఆయ‌న కామెంట్లుచేయ‌క‌పోయినా.. ప‌రోక్షంగా ఆయ‌న రాష్ట్ర బీజేపీ చీఫ్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని టార్గెట్ చేసిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇటీవ‌ల కాలంలో కిష‌న్ రెడ్డిని రాజా సింగ్ నేరుగానే టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో సంచ‌ల‌నంగా మారాయి. గ‌త ఎన్నిక‌ల్లో అంటే.. 2023లోనూ.. ఇలానే వ్య‌వ‌హ‌రించార‌ని.. కులాల ప్రాతిప‌దిక‌న టికెట్లు ఇచ్చార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇప్పుడు కూడా ఉప ఎన్నిక‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఇచ్చేలా.. అవ‌స‌ర‌మైతే.. అమ్ముకునేలా ప్లాన్ చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇక‌, ముస్లిం ఓటు బ్యాంకుపైనా ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. జూబ్లీహిల్స్ జ‌న‌ర‌ల్ టికెట్ అయినా కూడా..ఇక్క‌డ ముస్లింల ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంది.

దీంతో ముస్లింల ప్ర‌భావం త‌మ‌వైపు తిప్పుకొనేందుకు పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తాయి. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. గ‌త ఎన్నికల్లో ఇక్క‌డి ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం పార్టీ నేరుగా బీఆర్ ఎస్ పార్టీకి అమ్మేసింద‌ని రాజా సింగ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే.. అక్క‌డ బీజేపీ ఓడిపోయింద‌న్నారు. ఈసారి కూడా.. ముస్లింల ఓటు బ్యాంకును అమ్మేందుకు ప్ర‌య‌త్నాలుజ‌రుగుతు న్నాయ‌ని తెలిపారు. అయితే.. ఈ ద‌ఫా ఈ ఓటు బ్యాంకును బీఆర్ఎస్‌కు అమ్ముతారో.. లేక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి విక్ర‌యిస్తారో చూడాల‌న్నారు. కానీ, త‌మ పార్టీ మాత్రం ఉప ఎన్నిక‌ల్లో టికెట్‌ను రెడ్డి వ‌ర్గానికి కేటాయించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం రాజా సింగ్ చేసిన ఆరోప‌ణ‌లు బీజేపీలోనే కాకుండా.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. నిన్న గాక మొన్న చ‌నిపోయిన ఎమ్మెల్యే స్థానంపై ఇంకా ఎవ‌రూ దృష్టి పెట్ట‌లేద‌ని.. అవ‌స‌ర‌మైతే.. బీఆర్ ఎస్ అన్ని పార్టీల‌నూ ఒప్పించి.. ఇక్క‌డ ఏక‌గ్రీవం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మాగంటి త‌న‌యుడుని ఇక్క‌డ పోటీకి నిల‌బెట్టే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు. అస‌లు ఇంకాచ‌ర్చ‌ల్లోకే రాని విష‌యంపై రాజా సింగ్ వివాదం చేయ‌డం, సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఇక‌, దీనిపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.