తెలంగాణ రాజకీయాల్లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. భారత రాష్ట్ర సమతి (బీఆర్ఎస్) అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనా కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. అయితే ఆ ప్రాజెక్టులోని కీలక భాగం అయిన మేడిగడ్డ డ్యామ్ ఉపరితలం కుంగింది. దీనిపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఏకంగా విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణకు ఇప్పటికే నాటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ లు హాజరయ్యారు.
ఈ క్రమంలో ఈ నెల 11న అంటే… బుధవారం కేసీఆర్ ఈ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఇంందుకోసం కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్ కు కేసీఆర్ వెళ్లనున్నారు. కేసీఆర్ వెంట ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చాలా మందే బీఆర్కే భవన్ కు తరలివెళ్లనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ నెల 5ననే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఏమనుకున్నారో, ఏమో తెలియదు గానీ, తాను ఈ నెల 5న కాకుండా 11న విచారణకు హాజరు అవుతానంటూ కేసీఆర్ కమిషన్ కు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కమిషన్ కూడా ఓకే అనడంతో బుధవారం కేసీఆర్ విచారణకు హాజరు అవుతున్నారు.
బుధవారం కేసీఆర్ విచారణకు హాజరు అవుతున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నమే ఆయన మేనల్లుడు, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లి వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎర్రవలి ఫామ్ హౌస్ చేరుకున్నారు. కమిషన్ విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఎధురు కానున్నాయి? వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలన్న విషయంపై మామాఅల్లుళ్లు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చర్చలు మంగళవారం రాత్రి పొద్దు పోయేదాకా జరిగాయి. మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర విశ్లేషణలు చేసుకున్న వీరిద్దరూ… కమిషన్ ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు ఇవ్వడంతో పాటుగా వాటికి సంబంంధించిన ఆధారాలను కూడా అందజేసే దిశగా ెకసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates