అమరావతి విషయంపై చర్చ పెట్టి.. అక్కడి మహిళలను తీవ్రంగా అవమానించిన వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్, వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల స్పందించారు. ఈ వ్యవహారంపై జగన్, ఆయన సతీమణి భారతి ఇద్దరూ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అసలు రాజధానిపై మాట్లాడే అర్హత సాక్షి యాజమాన్యానికి లేదన్నారు. గతంలో అనేక సార్లు కూడా అవమానకరంగా ఇక్కడి వారిని మాట్లాడారని.. చెప్పారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత.. అయినా జగన్‌లో మార్పు రావాల్సి ఉందన్నారు.
కానీ, పదే పదే అమరావతిపై విషం చిమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా చేపట్టిన చర్చలో మహిళలను తీసుకురావడం ఏంటని ఆమె ప్రశ్నించారు. సోమవారం చిత్తూరు జిల్లాకు వచ్చిన షర్మిల.. మీడియాతో మాట్లాడారు. మహిళలను అవమానించే సంస్కృతి వైసీపీతోనే ప్రారంభమైందని దుయ్యబట్టారు. సాక్షి చానెల్‌కు కూడా ఈ విష సంస్కృతి విస్తరించిందన్నారు. ఈ విషయంలో జగన్ క్షమాపణలు చెప్పడంతోపాటు భారతితోనూ చెప్పించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. తప్పు జరిగింది ఛానెల్‌లో కాబట్టి.. వారిద్దరే బాధ్యులని వ్యాఖ్యానించారు.
పదేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేదని.. ఇప్పుడు అంతో ఇంతో కట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని షర్మిల చెప్పారు. ఈ సమయంలో మరో దెబ్బ కొట్టేలా ఇక్కడివారిని వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. రాష్ట్రానికి కేరాఫ్ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు రాజధాని ఏర్పాటు చేసుకునే దశలో ఉన్నామని.. ఇలాంటి సమయంలో మహిళలను ఏ రూపంలో కించ పరిచినా అది క్షమించరాని నేరమేనని చెప్పారు. మీడియా హౌస్ యజమానిగా భారతీ రెడ్డి అమరావతి మహిళలకు క్షమాపణలు చెప్పాలని.. ఇది తప్పుకాదని బాధ్యతని పేర్కొన్నారు.
అదేవిధంగా జగన్ కూడా ఆ మీడియా హౌస్ వ్యక్తే కాబట్టి ఆయన కూడా క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇక, సాక్షి మీడియాకు.. ప్రజల సమస్యలతో పనిలేకుండా పోయిందని.. ఒక పార్టీకి కొమ్ము కాస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలపై ఏనాడైనా గళం వినిపించిందా? అని షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి మీడియా సంస్థను చూస్తే జాలేస్తోందని వ్యాఖ్యానించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని అన్నారు.