సాక్షి ఇన్ పుట్ ఎడిటర్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేని అరెస్టును ఖండిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టును పెట్టారు. అందులో కొమ్మినేనిని 70 ఏళ్ల వృద్ధుడిగా, సీనియర్ జర్నలిస్టుగా ఆయన పేర్కొన్నారు. కొమ్మినేని అరెస్టుతో కూటమి సర్కారు కక్షసాధింపుల విష సంస్కృతిని పతాకస్థాయికి తీసుకెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు.
కొమ్మినేని అరెస్టును తప్పుబట్టిన జగన్…అసలు కొమ్మినేని చేసిన తప్పేమిటని కూడా ప్రశ్నించారు. ఓ చర్చా కార్యక్రమంలో వక్తలు మాట్లాడే దానికి ఆ చర్చను నిర్వహించే యాంకర్ కు ఏం సంబంధం ఉంటుందని కూడా జగన్ ప్రశ్నించారు. సహజంగానే ఆయా డీబేట్లలో కొందరు వక్తలు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారని, వాటిని యాంకర్ కు ఆపాదిస్తే ఎలాగని ఆయన ప్రశ్నించారు. కొన్ని టీవీ ఛానెళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్ట్ లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా?.. ఆ తరహా డీబేట్ లు ఇప్పటికీ కొనసాగడం లేదా? అని కూడా జగన్ ప్రశ్నించారు.
ఏపీ అరాచకానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిందన్న జగన్..ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేథావులు, జర్నలిస్లులను భయకంపితులను చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన ఏడాది కాలంగా చంద్రబాబు సర్కారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ తరహా అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన మోసాలు, అవినీతి, వైఫల్యాలు బయటపడకుండా, వాటిపై ఆయా వర్గాలు గొంతెత్తకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ తరహా అరాచక పాలనకు తెర తీశారని జగన్ ఆరోపించారు.
కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష ఈనాటిది కాదని కూడా జగన్ చెప్పుకొచ్చారు. 2014-19 మధ్యకాలంలో కొమ్మినేని పని చేస్తున్న మీడియా సంస్థలో ఆయనకు ఉద్యోగం లేకుండా చంద్రబాబు చేశారని కూడా జగన్ ఆరోపించారు. సాక్షిలోకి వచ్చిన తర్వాత కూడా కొమ్మినేని తనకు మద్దతుగా లేరన్న భావనతోనే ఆయనను అరెస్టు చేయించారని ఆరోపించారు. చివరలో బాబుకు ప్రజలు అదికారం ఇచ్చింది ఐదేళ్లేనన్న జగన్… అందులో ఇప్పటికే ఓ ఏడాది పూర్తి అయిపోయిందని తెలిపారు. ఇప్పుడు మీరు ఏది విత్తుతారో, అదే రేపు మొలకెత్తుతుందని, అది ఇంకా రెండింతలు అవుతుందని కూడా జగన్ హెచ్చరించారు.