కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు సోమవారం హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయనను కమిషన్ సభ్యులు విచా రించారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన హరీష్ రావు.. కమిషన్ సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకూ తాను.. అన్నీ నిజాలే చెప్పానని తెలిపారు. ముఖ్యంగా రీ డిజైనింగ్‌పై ఎక్కువగా గుచ్చి గుచ్చి ప్రశ్నించారని తెలిపారు. అయితే.. దీనిపై తమకు స్పష్టత ఉందన్నారు.
అందుకే ఆధారాలతో సహా ఎందుకు రీడిజైన్ చేయాల్సివచ్చిందో వివరించానని హరీష్ పేర్కొన్నారు. ప్రాజెక్టు కు సంబంధించిన డీపీఆర్ నుంచి లే అవుట్ వరకు అన్నీ కమిషన్‌కు సంపూర్ణంగా వివరించాన న్నారు. “దీనిలో దాచుకునేందుకు.. దాచిపెట్టేందుకు కూడా ఏమీ లేదు. అంతా ఉన్నది ఉన్నట్టుగానే వివరించా. మహారాష్ట్ర సహా.. సెంట్రల్ వాటర్ కమిషన్( సీడబ్ల్యూసీ) చేసిన అభ్యంతరాల కారణంగానే ప్రాజెక్టును రీ డిజైన్ చేయాల్సి వచ్చింది.” అని వివరించారు.
అన్ని విషయాలను కేంద్రానికి… కేంద్ర జల సంఘానికి వివరిస్తూనే ఉన్నామని.. ప్రాజెక్టు విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపల్లి బ్యారేజీల గురించి తనను ప్రశ్నించారని హరీష్ రావు చెప్పారు. అయితే.. వాటికి కేబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుందని.. దీనికి సంబంధించిన మినిట్స్ నకలును కూడా కమిషన్‌కు ఇచ్చానన్నారు. ఇంజినీర్ల సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మార్పు జరిగిందన్నారు.
ఇక, కీలకమైన సొమ్ముల దుర్వినియోగంపైనా.. ప్రాజెక్టు వ్యయం పెంపుపైనా తనను ప్రశ్నించినట్టు హరీష్ రావు పేర్కొన్నారు. అయితే.. ప్రాజెక్టును రీ డిజైన్ చేయడం వల్లే.. ఖర్చు పెరిగిందని.. దీనిని కూడా అప్ప టి మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి కార్పొరేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. కేంద్రప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నట్లు తెలిపారు.