ప్రభాకర్ రావు నోరిప్పితే బీఆర్ఎస్ కు బ్యాండ్ బాజానే!

తెలంగాణలో పెను చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా భావిస్తున్న మాజీ పోలీసు అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 15 నెలల తర్వాత అమెరికా నుంచి ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ కేసు వెలుగు చూసిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు… ఈ కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే ఆయన వ్యూహాలు ఫలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ తిరిగి రాక తప్పలేదు.

బీఆర్ఎస్ అధికారంలో ఉండగా…విపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు కలకలమే రేపాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యం దిశగా సాగిన బీఆర్ఎస్ ఇలా విపక్షాలకు చెందిన నేతల వ్యూహాలను పసిగట్టేందుకే ఫోన్ ట్యాపింగ్ ను ఎంచుకుందని… అందుకు ప్రభాకర్ రావును వినియోగించుకుందని, ప్రభాకర్ రావు కూడా బీఆర్ఎస్ చెప్పినట్లుగా నడుచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావుకు ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు కూడా సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే శ్రవణ్ రావును ఈ కేసు విచారణను చేపట్టిన సిట్ విచారించింది.

ఇదిలా ఉంటే… ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును విచారిస్తే తప్పించి పూర్తి వివరాలు తెలియరావని, ఆయనను హైదరాబాద్ తిరిగి రప్పించాల్సిందేనని కాంగ్రెస్ సర్కారు గట్టి ప్రయత్నాలే చేసింది. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించే దిశగా ప్రభాకర్ రావు నడుచుకోగా.. ఆయనపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా దేశం తిరిగి వస్తే… అప్పుడు మీ వాదన వింటామని ఆయనకు కోర్టు తెగేసి చెప్పింది. అంతేకాకుండా విచారణకు సహకరించాల్సిందేనని కూడా ఆయనకు తేల్చి చెప్పింది.

అప్పటికే రాజకీయ శరణార్థిగా తనకు ఆశ్రయం కల్పించాలని ప్రభాకర్ రావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను అమెరికా కోర్టు తీరస్కరించిన నేపథ్యంలో ఆయన తిరిగి హైదరాబాద్ రాక తప్పలేదు. ఆదివారం ఎమిరేట్స్ విమానంలో దుబాయి మీదుగా ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. నేటి రాత్రి రెస్ట్ తీసుకోనున్న ప్రభాకర్ రావు… సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. సిట్ విచారణలో ప్రబాకర్ రావు ఏం చెబుతారన్న దానిపై ఇప్పడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాడు జరిగిన విషయాలన్నింటినీ జరిగినట్టుగానే ఆయన చెబితే… బీఆర్ఎస్ కు గడ్డు కాలం వచ్చేసినట్టేనని చెప్పక తప్పదు.