అమరావతిలో మహిళలపై వైసీపీకి చెందిన సాక్షి చానెల్‌లో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆదివారం ఉదయం పార్టీ నాయకులతోనే కాకుండా.. మంత్రులతోనూ ఆయన చర్చించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పిన ఆయన.. దీనిపై ఎవరూ స్పందించరాదని ఆదేశించినట్టు తెలిసింది. ప్రభుత్వం పరంగా.. చర్యలు తీసుకుంటామని.. దీనిపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ పరంగా తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మంత్రులతోనూ ప్రత్యేకంగా చర్చించారు.
ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయాలన్న విషయంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. దీనిని సీరియస్ గా తీసుకుని తీరాలని చాలా మంది మంత్రులు తేల్చిచెప్పారు. అంతేకాదు.. అమరావతి మహిళలను కించ పరచడం వైసీపీకి కొత్తకాదని.. దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా.. వ్యాఖ్యానించారు. గతంలోనూ మహిళలపై దాడులు చేయించిన చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు మరింత పేట్రేగి పోయారని.. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఇక, అమరావతి ఘటనపై చర్యల విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని కొందరు సూచించారు. ఇది ఖండించాల్సిన విషయమేనని.. అయితే.. ఏం చేసినా.. మళ్లీ మహిళలకు ఇబ్బందులు రాకుండా చూడాలని వారు కోరారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే.. అక్కడ వేరే రకానికి చెందిన వారు ఉంటున్నారని చెప్పడం ద్వారాపెట్టుబడులపై దెబ్బ కొట్టాలన్న వ్యూహం దాగి ఉండి ఉంటుందని మహిళా మంత్రి ఒకరు చెప్పారు. దీనిని చంద్రబాబు కూడా అంగీకరించారు.
ఇప్పటికే అనేక రూపాల్లో వైసీపీ నాయకులు పేట్టుబడులను అడ్డుకుంటున్నారని.. అయినప్పటికీ ప్రభుత్వం నానా ప్రయాసలు పడి పెట్టుబడులు తెస్తోందని.. అయినప్పటికీ.. వైసీపీ జీర్ణించుకోలేక పోతోందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇదేసమయంలో మహిళల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయించే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు.