ఓ మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు అది తప్పని తెలియాలంటే… ఏదో పెద్ద జరగరాని ఘటన జరిగితే తప్ప కనువిప్పు కలగదు. ఇప్పుడు ఏపీలోని విపక్షం వైసీపీలోనూ అదే తరహా మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నంత కాలం రాజధాని అమరావతి కాదని, మూడు రాజధానులు అని కదం తొక్కిన జగన్ అండ్ కో… విశాఖను రాజధానిగా చేసి అమరావతి కలను కూల్చాలని యత్నించారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనం కొట్టిన దెబ్బకు జగన్ గ్యాంగ్ కు దిమ్మతిరిగి పోయింది. ఆపై క్రమంగా ఆ పార్టీ నేతల్లో మార్పు కనిపిస్తోంది. కనువిప్పు కలుగుతోంది. ఇప్పుడు ఈ దిశగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోగి రమేశ్ అమరావతి కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతితో పాటు మరో రెండు రాజధానులు… మొత్తంగా 3 రాజధానులు అంటూ తాము చేసిన ప్రతిపాదనకు ప్రజలు అంగీకారం తెలపలేదని ఆయన అన్నారు. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో తమ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదన్నారు. భవిష్యత్తులో తమ పార్టీ అధినేత జగన్ సీఎం కావడం ఖాయమని, ఆపై అమరావతిని జగనే అభివృద్ధి చేసి తీరతారని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు అమరావతి అభివృద్ధి ప్రణాళికలు రచిస్తే.. వాటిని అమలు చేసేది మాత్రం జగనేనని జోగి చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా జోగి రమేశ్ మరింత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్న రాజధాని రైతులపై తమ ప్రభుత్వ హయాంలో దాడులు జరగడం తప్పేనని జోగి ఒప్పేసుకున్నారు. అస్సలు మొన్నటి ఎన్నికల తీర్పు తర్వాత కనీస అవగాహన ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా మళ్లీ మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకొస్తుందా? అని కూడా జోగి ప్రశ్నించారు. ఇదే రీతిన తాము కూడా మళ్లీ మూడు రాజధానుల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. జగన్ సీఎం అయ్యాక అమరావతిలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కూడా ఆయన చెప్పడం గమనార్హం.
జోగి రమేశ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కనువిప్పు జోగి రమేశ్ లో మాత్రమే కలిగిందా? లేదంటే… జగన్ లోనూ ఇదే పశ్చాత్తాపం కలిగిందా? అన్న దిశగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిజానికి అమరావతిపై వ్యతిరేకత జగన్ తో పాటు వైసీపీకి తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. మాట తప్పను, మడమ తిప్పను అంటూ నిత్యం చెప్పే జగన్…అమరావతి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు అందుకు బిన్నంగా ఉందని తేలిపోయింది. ఈ కారణంగానే జగన్ మాట మీద నిలిచే రకం కాదని జనంలో ఓ బలమైన అభిప్రాయం అయితే కలిగింది. ఈ కారణంగానే 151 సీట్లతో అత్యంత బలంగా ఉన్న వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఏకంగా 11 సీట్లకు పడిపోయింది. మరి ఈ కనువిప్పు ప్రకటనలు వైసీపీకి ఏ రీతిన లబ్ధి చేకూరుస్తాయో చూడాలి.