బ్రేకింగ్… జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి

తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత గురువారం మధ్యాహ్నం తర్వాత ఇంటిలో గుండెపోటు కారణంగా కింద పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మూడు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేశారు. అయితే ఈ పోరులో ఓడిన గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. 

హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన మాగంటి… జూబ్లీహిల్స్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2014, 2018, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో అయితే దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డిని ఓడించి మరీ జూబ్లీహిల్స్ మీద తన పట్టు నిలుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అత్యంత దగ్గరగా మసలుకున్న గోపీనాథ్…తన కోసం పనిచేసే మంచి కార్యకర్తల గణాన్ని పెంపొందించుకున్నారు. ఇదే ఆయనను వరుసబెట్టి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిందని చెప్పాలి.

టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీతోనే రాజకీయాల్లోకి గోపీనాథ్ అడుగుపెట్టారు. టీడీపీలో నాటి ఉమ్మడి రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి డైరెక్టర్, హైదరాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తదితర పదవులను ఆయన చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో అందరి మాదిరే టీడీపీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు.

పార్టీ మారినా కూడా గోపీనాథ్ జూబ్లీహిల్స్ పై మాత్రం పట్టు విడవలేదు. టీడీపీ తరఫున తొలిసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి..ఆ తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ తరఫున అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీలో మాదిరిగానే బీఆర్ఎస్ లోనూ మాగంటికి మంచి ప్రాధాన్యమే దక్కింది. కేసీఆర్ ముఖ్య అనుచరుల్లో మాగంటి చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే…హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. అంతటి కీలక పదవుల్లో ఉన్న మాగంటి హాఠాత్తుగా చనిపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ కు గురయ్యారు.